యాప్నగరం

ప.గో: పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు, రూ. లక్షల్లో చోరీ.. దిమ్మతిరిగే విషయాలు!

పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో భారీ చోరీ జరగడం కలకలం రేపింది.

Samayam Telugu 17 Mar 2021, 7:58 pm
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌ స్టేషన్‌లో భారీ దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. ప్రజలకు రక్షణ కల్పించి, చోరీలు, దోపిడీలకు అడ్డుకట్ట వేసే పోలీసులు ఉండే చోటే పెద్ద ఎత్తున డబ్బు చోరీ కావడం కలకలం సృష్టించింది. వీరవాసరం పోలీస్‌ స్టేషన్‌లో రూ. 8 లక్షలకు పైగా నగదు చోరీకి గురైన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Samayam Telugu వీరవాసరం పోలీస్ స్టేషన్‌లో చోరీ


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వీరవాసరం, నౌడూరు, కొణితివాడ, రాయకుదురు మద్యం దుకాణాలకు సంబంధించిన డబ్బును సోమవారం పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచారు. ఈ నెల 15వ తేదీ నుంచి బ్యాంకులకు సెలవు కావడంతో ఆయా దుకాణాల సిబ్బంది నగదును పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లోని ఓ లాకర్‌లో డబ్బును భద్రపరిచారు.

అయితే, బుధవారం బ్యాంకులు తెరుచుకోవడంతో డబ్బును జమ చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన దుకాణ సిబ్బంది లాక్ ఓపెన్ చేసి షాక్ తిన్నారు. అందులో డబ్బు కనిపించలేదు. మద్యం దుకాణాలకు సంబంధించిన రూ. 8,04,330 నగదు చోరీకి గురైనట్లు గ్రహించి వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

చోరీకి గురైన నగదులో వీరవాసరం మద్యం దుకాణానికి సంబంధించి రూ.1,50,000, నౌడూరు దుకాణం- రూ.2,16,060, కొణితివాడ దుకాణం- రూ.50,000, రాయకుదురు దుకాణానికి చెందిన రూ.3,88,270 ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. స్టేషన్‌లో డబ్బు చోరీ కావడంతో పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. నగదు అపహరణ విషయమై పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.