యాప్నగరం

జశ్వంత్ రెడ్డి ఫ్యామిలీకి రూ. 50 లక్షలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

కశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరులో భాగంగా వీరమరణం పొందిన బాపట్ల జవాన్ జశ్వంత్ రెడ్డి కుటుంబానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు.

Samayam Telugu 9 Jul 2021, 3:16 pm
దేశరక్షణలో భాగంగా ఉగ్రవాదులపై పోరులో వీరమరణం పొందిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాన్ జశ్వంత్‌రెడ్డి (23) చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దేశ రక్షణ కోసం కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనదని పేర్కొన్నారు. మన జవాన్‌ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు.
Samayam Telugu జశ్వంత్ రెడ్డి కుటుంబానికి సీఎం జగన్ సాయం


ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ. 50 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌కు ఈ సమాచారం తెలియగానే.. వేగంగా రియాక్ట్ అయ్యి జస్వంత్ రెడ్డి కుటుంబానికి తక్షణమే సాయం అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


అలాగే జస్వంత్‌రెడ్డికి నివాళులర్పిస్తూ శుక్రవారం మధ్యాహ్నం సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘దేశరక్షణ కోసం కశ్మీర్‌లో ప్రాణాలర్పించిన బాపట్లకు చెందిన మన జవాన్‌ జశ్వంత్‌రెడ్డి ధైర్యసాహసాలు, త్యాగం చిరస్మరణీయం. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.