యాప్నగరం

Guntur: టీడీపీలో చేరిన వైసీపీ నేత.. ఒక స్పష్టమైన లక్ష్యంతో!

Gudibanda Govardhan Reddy: గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకట్ రెడ్డి సోదరుడి కుమారుడు గుదిబండ గోవర్ధన్ రెడ్డి.. టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత పదేళ్లుగా ఆయన వైసీపీ కోసం పని చేశారు. ఒక ఆశయం కోసం, స్పష్టమైన లక్ష్యంతో టీడీపీలో చేరుతున్నానని గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. మనసున్న వారెవరూ వైసీపీలో ఉండరని చంద్రబాబు అన్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 19 Aug 2022, 9:09 pm
గుంటూరు జిల్లా తెనాలికి (Tenali) చెందిన వైఎస్సార్‌సీపీ నేత గుదిబండ గోవర్ధన్‌ రెడ్డి (Gudibanda Govardhan Reddy).. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోవర్ధన్‌ రెడ్డికి చంద్రబాబు నాయుడు టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు అనుచరులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి సోదరుడి కుమారుడు గోవర్ధన్ రెడ్డి. గత పదేళ్లుగా ఆయన వైఎస్సార్‌సీపీ కోసం పని చేశారు.
Samayam Telugu Chandrababu Naidu
చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫొటో)


ఒక ఆశయం కోసమే టీడీపీలో చేరుతున్నట్టు గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలను వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైఎస్ జగన్‌ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదనే భావనలో ప్రజలు ఉన్నారని అన్నారు.

మనసు ఉన్నవారు ఎవరూ వైసీపీలో ఉండరని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గోవర్ధన్‌ రెడ్డి అని, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారని చెప్పారు. అందుకే టీడీపీలో చేరారని అన్నారు.

‘ప్రస్తుతం దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నా వంతు కర్తవ్యం నిర్వహిస్తా. మూడేళ్ల వైసీసీ పాలనలో జరిగిన అన్యాయాలపై ప్రజల్లో చాలా బాధ ఉంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో జరిగిన 5 ఘటనలు చూసి బాధ కలిగింది. అన్యాయమని ప్రశ్నిస్తే.. వేధింపులకు గురి చేస్తున్నారు. మద్యం తయారీ, విక్రయం అన్నీ వాళ్లవే. డబ్బు కక్కుర్తితో ఏదైనా చేస్తున్నారు’ అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

Also Read: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.