యాప్నగరం

నా హృదయం బరువెక్కిపోయింది, ఈ ఘోరానికి ఎవరు బాధ్యులు.. పవన్ కళ్యాణ్ భావోద్వేగం

కడప జిల్లాలో జరిగిన భారీ పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Samayam Telugu 8 May 2021, 4:37 pm
కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన భారీ పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర విషాదకరమన్నారు. జిలిటెన్‌స్టిక్స్ పేలి 10 మంది మృత్యువాత పడ్డారనే వార్త హృదయాన్ని కలచివేసిందన్నారు. ఈ విషాదకర ఘటనలో చనిపోయినవారిని గుర్తించలేని పరిస్థితి ఉందని భావోద్వేగం చెందారు. దీన్ని బట్టి ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి.. మృతుల కుటుంబాలకు న్యాయబద్ధమైన పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. గని యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


కాగా, కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో శనివారం జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. ఈ ఘటన జరిగిన స్థలాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పేలుడు ఘటనలో 10 మంది చనిపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5 మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. మరో 5 మృతదేహాల కోసం చుట్టుపక్కల గాలిస్తున్నామని చెప్పారు. ఘటన, క్వారీ అనుమతులపై విచారిస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు.

కాగా, ముగ్గురాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలను వినియోగించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.