యాప్నగరం

సీమలోకి సింగం ఎంట్రీ.. వచ్చీ రాగానే ఫ్యాక్షన్ విలేజ్‌పై ఫోకస్.. అక్కడే పల్లె నిద్ర!

Kurnool SP | కర్నూలు జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిద్ధార్థ్ కౌశల్ అప్పుడే తనదైన మార్క్ చూపించడం మొదలు పెట్టారు. శాంతి భద్రతలు, మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన ఆయన అందుకు తగ్గట్టుగానే అడుగులేశారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజే ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామంలో పల్లె నిద్రకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాక్షన్ జోలికి వెళ్లొద్దని గ్రామస్థులను హెచ్చరించారు. పిల్లలను చదివించుకోవాలని సూచించారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 24 Jun 2022, 9:41 pm
Samayam Telugu Siddharth Kaushal
Siddharth Kaushal IPS
కర్నూలు జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టగానే సిద్ధార్థ్ కౌశల్ తనదైన మార్క్ చూపించడం మొదలుపెట్టారు. సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి స్థానంలో గురువారం బాధ్యతలు చేపట్టిన ఆయన వెంటనే కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్‌, జిల్లా కలెకర్ట్, జడ్జిలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. 24 గంటలు ప్రజలకు సేవలందిస్తామని ప్రకటించారు. మహిళల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తామనన్నారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు ప్రకటించారు. అసాంఘిక కార్యక్రమాలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు.

ఆ తర్వాత నేరుగా రంగంలోకి దిగిన సిద్ధార్థ్ కౌశల్.. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కౌతాళం మండలంలోని కామవరాన్ని సందర్శించారు. ఈ ఏడాది జనవరిలో భూవివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణల్లో కామవరంలో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో పల్లె నిద్రలో భాగంగా ముందుగా కామవరం గ్రామాన్ని ఎంపిక చేసుకున్న గురువారం రాత్రి ఆ ఊళ్లోనే నిద్రపోయారు.
అంతకు ముందు కామవరంలోని గ్రామ సచివాలయం, ఆర్టీసీ బస్టాండ్, అంగన్ వాడి సెంటర్, రైతు భరోసా కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఎవరూ ఫ్యాక్షన్ జోలికి వెళ్లొద్దని.. పిల్లలను బాగా చదివించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2 వేల మంది గ్రామస్థులు పాల్గొన్నారు.

మహిళలందరూ భద్రత కోసం తమ ఫోన్లలో దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కామవరం గ్రామంలో జంట హత్యలకు గురై బాధితుల ఇళ్ళకు వెళ్లిన ఆయన వారిని పరామర్శించారు. అనంతరం గ్రామంలోని మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో రాత్రి జిల్లా ఎస్పీ పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు.

అంతకు ముందు కృష్ణా జిల్లా ఎస్పీగా పని చేసిన సిద్ధార్థ కౌశల్.. తనదైన మార్క్ చూపించారు. కొంత కాలంగా కర్నూలు జిల్లాలో పరిస్థితులు సున్నితంగా మారుతుండటంతో... ఆయన్ను ఇక్కడికి బదిలీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీగా పి జాషువాను నియమించారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.