యాప్నగరం

YSRCP తరఫున పోటీ చేయించి నిండా ముంచేశారు, 3 ఎకరాలు అమ్మేశా.. రూ. 40 లక్షలు ఖర్చుపెట్టా.. సీఎం జగన్‌కు సంచలన లేఖ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళ సంచలన లేఖ రాశారు.

Samayam Telugu 3 Apr 2021, 11:28 pm
సర్పంచ్‌గా పోటీ చేయించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనను ఘోరంగా మోసం చేశారని కర్నూలు జిల్లా దేవనకొండ సర్పంచి అభ్యర్థి గీత ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి శనివారం ఆమె లేఖ రాశారు. సర్పంచ్ అభ్యర్థిగా ఖర్చంతా తనతో పెట్టించి చివరకు ప్రత్యర్థులకు మద్దతిచ్చారని ఆరోపించారు. వ్యవసాయం చేసుకునే తనను బలవంతంగా ఎన్నికల్లోకి దించి, చివరికి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu సీఎం జగన్కు గీత లేఖ


దేవనకొండకు చెందిన కొందరు వైసీపీ నాయకులు తనను నమ్మించి ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 40 లక్షల వరకు ఖర్చు చేయించారని గీత ఆరోపించారు. ఇందుకోసం తనకున్న 3 ఎకరాల పొలాన్ని వైసీపీకి చెందిన ఓ నాయకుడికి అమ్మానని వివరించారు. అయితే ఎన్నికల్లో తాను ఓడిపోయానని.. రూ. 40 లక్షలతో పాటు మూడెకరాల పొలం కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపే తనను ఎన్నికల బరిలోకి దింపిన వైసీపీ నాయకులు చివరికి, కష్టాలపాలు చేశారని వాపోయారు. తనను ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని గీత లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌, మంత్రి జయరాంకు వేర్వేరుగా లేఖలు రాశారు. కర్నూలు జిల్లాలోని దేవనకొండ మండల కేంద్రానికి చెందిన గీతను వైకాపా తరఫున సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ధన ప్రవాహం ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండకూడదని సీఎం జగన్ అన్నారు. ఈ తరుణంలో కేవలం సర్పంచ్ స్థానానికే రూ. 40 లక్షలు ఖర్చు పెట్టానని ఓ మహిళా అభ్యర్థి ఏకంగా సీఎం జగన్‌కు లేఖ రాయడం సంచలనం రేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.