యాప్నగరం

AP Capital: తగ్గిన అమరావతి పరిధి.. రాజధాని ఆందోళనలకు జగన్ సర్కారు చెక్?

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న తరుణంలో.. అమరావతి పరిధిలోని ఐదు గ్రామాలను మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 8 Feb 2020, 9:25 am
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి కోసం భూములు ఇచ్చిన గ్రామాల ప్రజలు గత 8 వారాలుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. రాజధానిని తరలించడం లేదని, వికేంద్రీకరణ మాత్రమే చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇటీవలే అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు రైతులు సీఎం జగన్‌ను కలిసొచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి ఆందోళనల వేళ.. జగన్ సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu amaravati jagan


అమరావతి నుంచి ఐదు గ్రామాలను తొలగించి.. వాటిని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి పంచాయతీలను మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం వేర్వేరుగా జీవోలు ఇచ్చింది.

తాడేపల్లి మండలంలోని పెనుమాక, ఉండవల్లి రాజధాని పరిధిలోకి వస్తాయి. ఈ రెండు గ్రామాలతోపాటు ప్రాతూరు, వడ్డేశ్వరం, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావూరు, గుండిమెడ పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాలైన నవులూరు, బేతపూడి, ఎర్రబాలెంతో పాటు ఆత్మకూరు, చినకాకాని పంచాయతీలను మంగళగిరి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జీవో జారీ చేశారు.

రాజధాని నగర పరిధిలోని 25 గ్రామ పంచాయతీలతోపాటు కొత్తగా మరో 3 పంచాయతీలను కలిపి అమరావతి కేపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏసీసీఎంసీ) ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉండగానే.. ప్రభుత్వం అమరావతి పరిధి నుంచి ఐదు గ్రామాలను తప్పించడం గమనార్హం. అమరావతి ఆందోళనలకు అడ్డుకట్ట వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

కానీ ప్రభుత్వ వాదన మాత్రం మరోలా ఉంది. తాడేపల్లి, మంగళగిరిలను మోడల్‌ మున్సిపాల్టీలుగా చేస్తామని జగన్ సర్కారు మొదటి నుంచి చెబుతోంది. ఇందుకోసం రూ.1100 కోట్లు ఖర్చు అవసరమని ఇటీవలే సీఎం జగన్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.