యాప్నగరం

రాజ్యాంగం ప్రకారమే చేస్తున్నారా.. జగన్ సర్కారుకు హైకోర్టు ప్రశ్నలు

ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయవాడకు చెందిన ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Samayam Telugu 6 May 2020, 1:28 pm
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఓ న్యాయవాది హైకోర్టులో సవాల్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఉన్న చట్టబద్ధత లేదంటూ విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్‌. వరలక్ష్మి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం దీనిపై నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని జగన్ సర్కారును ఆదేశించింది. పిటిషనర్‌ తరఫున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
Samayam Telugu ఏపీ హైకోర్టు, సీఎం జగన్


ఈ అంశంపై వైసీపీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది సుమంత్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించే పారిశ్రామికవేత్తలు ఎవరైనా దీనిపై పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంటుంది తప్ప న్యాయవాదులు, ఇతరులకు అవకాశం లేదని కోర్టుకు తెలిపారు. ఈ అంశంలో ప్రజాప్రయోజనం కూడా ఇమిడి ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.

స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని రాజ్యాంగానికి లోబడే ఈ నిర్ణయం తీసుకుందా? దీనికి ఉన్న చట్టబద్ధత ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో కౌంటర్‌ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరగా.. సానుకూలంగా స్పందించిన ధర్మాసనం నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.