యాప్నగరం

Kalyanamasthu పెళ్లి కానుక.. వధూవరులకు ఉండాల్సిన అర్హతలివే, వెబ్‌సైట్ ప్రారంభించిన సీఎం జగన్

YSR Kalyanamasthu: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అక్టోబర్‌ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలు అమలు కానున్నాయి. పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఈ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి లక్షా 20 వేల రూపాయలు కానుకగా అందజేస్తారు. దివ్యాంగులకు ఈ పథకం కింద రూ.1.5 లక్షలు ప్రోత్సాహకంగా అందించనున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 30 Sep 2022, 6:18 pm
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu)’, ‘షాదీ తోఫా’ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రారంభించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం (సెప్టెంబర్ 30) ఈ పథకాలకు సంబంధించిన వెబ్‌సైట్లను లాంఛనంగా ప్రారంభించారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాలు అమల్లోకి రానున్నాయి. పేదింటి ఆడపిల్లల పెళ్లి సందర్భంగా ఈ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి లక్షా 20 వేల రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు. దివ్యాంగులకు ఈ పథకం కింద రూ.1.5 లక్షలు ప్రోత్సాహకంగా అందించనున్నారు. అయితే, ఈ పథకం కింద నగదు ప్రోత్సాహకం పొందేందుకు వధూవరులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వధువు 18 ఏళ్లు, వరుడు 21 ఏళ్లు నిండి ఉండాలని తెలిపారు.
Samayam Telugu YSR Kalyanamastu
వైఎస్సార్ కళ్యాణమస్తు


బాల్య వివాహాల నివారణ, చదువులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని చదువులతో కనెక్ట్ చేసినట్లు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అవసరమైతే వాలంటీర్ల సాయం తీసుకోవచ్చునని వెల్లడించారు.

ఈ పథకం కింద లబ్ధిదారులను గుర్తించి ప్రతి మూడు నెలలకు ఒకసారి నగదు ప్రోత్సాహం జమ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మొదటి త్రైమాసికం నిధులను ఏప్రిల్‌లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అక్టోబర్‌లో, అక్టోబర్ నుంచి జనవరి వరకు జనవరిలో ఇస్తామని వెల్లడించారు. ‘దేవుడి దయతో మరింత మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా..’ అని సీఎం జగన్ అన్నారు.

ఈ పథకం కింద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, మైనారిటీలతో పాటు భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందనున్నారు. బీసీలకు ఈ పథకం కింద రూ. 50 వేలు, కులాంతర వివాహమైతే.. రూ. 75 వేలు అందజేస్తారు. మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయల నగదు సాయం అందజేస్తారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు, దివ్యాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నారు.

గత ప్రభుత్వం ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం కింద అందించిన దానికంటే అధికంగా నగదు సాయం అందిస్తున్నామని వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు. ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం కింద ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేల ఆర్థిక సాయం ఉండగా.. ఇప్పుడు ఈ మొత్తాన్ని రెండింతల కంటే అధికం చేశారు. పేదింటి ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, వారికి గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా జగన్‌ సర్కార్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.