యాప్నగరం

YS Jagan 100 రోజుల పాలనపై కన్నా ఫైర్.. 2014లో అందుకే ఓడారు, సహజ గుణం బయటకొస్తుంది..

YS Jagan 100 days Rule | వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ 100 రోజుల పాలనపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. జగన్ ప్రతి నిర్ణయంలో అవగాహన రాహిత్యం కనిపిస్తోందన్నారు. జగన్‌కు పాలనపై పట్టు సడలిందనిపిస్తోందన్నారు.

Samayam Telugu 10 Sep 2019, 12:37 pm

ప్రధానాంశాలు:

  • ఈ వంద రోజుల్లో రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకున్న ఒక్క మంచి నిర్ణయమైనా ఉందా?
  • వ్యక్తులు మారారే తప్ప వ్యవస్థ మారలేదు.
  • ఒక మతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనిపిస్తోంది.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu jagan kanna
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్సీపీ వంద రోజుల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు సర్కారు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేసిందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారన్నారు. చంద్రబాబు సర్కారు చేసిన తప్పులను ఎత్తి చూపించిన జగన్.. అవినీతి రహిత పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చారన్నారు.
కానీ సీఎం అయిన నాటి నుంచి జగన్ చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అడ్మినిస్ట్రేషన్‌పై జగన్‌కు పట్టు సడలిందేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు టీడీపీ వాళ్లు అరాచకాలు చేశారు కదా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా చేసి చూపిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారని కన్నా తెలిపారు. జన్మభూమి కమిటీలను పేరు మార్చి గ్రామవాలంటీర్ల పేరిట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రభుత్వ ధనంతో జీతాలు ఇస్తున్నారని కన్నా ఆరోపించారు.

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అభివృద్ధి దిశగా నిర్ణయాలేవీ తీసుకోలేదన్న కన్నా.. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం కోల్పోయామన్నారు. రైతులకు రూ.12 వేలు పెట్టుపడి నిధి ఇస్తామని చెప్పిన జగన్.. కేంద్రం ఇచ్చే డబ్బులు అందులో కలిపారని విమర్శించారు. సహకార ఎన్నికలు జరిపే ధైర్యం కూడా జగన్‌కు లేకపోయిందని, ఇది పెద్ద తప్పిదమన్నారు.

ఇసుక మాఫియాను అరికడతామన్న జగన్.. లక్షల మంది భవననిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సెప్టెంబర్ 5న కొత్త ఇసుక పాలసీ ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఇసుక దొరకడం లేదు. ఆన్‌లైన్‌ విధానం పని చేయడం లేదని కన్నా ఆరోపించారు.

ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వైఎస్ఆర్సీపీ నాయకులు గాలికి వదిలేశారని బీజేపీ నేత ఆరోపించారు. ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే జగన్ అమెరికా వెళ్లి కూర్చున్నారని కన్నా ఆరోపించారు. రాయలసీమ ప్రజలు తాగునీరు కూడా లేకుండా ఇబ్బందులు పడుతుంటే అక్కడి ప్రాజెక్టులను నింపడంపై సీఎం ఫోకస్ పెట్టలేదని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో వ్యక్తులు మారారు కానీ.. వ్యవస్థ మాత్రం మారలేదన్నారు.

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4 లక్షల మందికిపైగా ఉద్యోగావకాశాలు కల్పించామని చెబుతోంది. కానీ జగన్ సర్కారు విధానాల వల్ల అంతకంటే ఎక్కువ మంది రాష్ట్రంలో బజారున పడ్డారని కన్నా ఆరోపించారు. కేంద్రం నూరు శాతం నిధులు అందజేస్తోన్న పోలవరం ప్రాజెక్టు కోసం నితిన్ గడ్కరీ మాట్లాడి నవయుగను తీసుకొచ్చి పెడితే.. టెండర్లను మీరు ఎలా రద్దు చేశారని జగన్‌ను కన్నా ప్రశ్నించారు.

జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ అవగాహనా రాహిత్యం కనిపిస్తోందన్నారు. నానాటికీ రాష్ట్ర అభివృద్ధి క్షీణించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒక మతానికి సంబంధించినట్టుగా వ్యవహరిస్తోందని కన్నా ఆరోపించారు. అది చాలా ప్రమాదకరమన్నారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని అనుకోవడం పారిశ్రామికీకరణకు అవరోధమన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అందరూ తమ వాళ్లే అన్నట్టుగా వ్యవహరించాలన్నారు.

ఫ్యాక్షనిస్టు భావాలున్న పార్టీ అనే 2014లో ప్రజలు మీకు అధికారం ఇవ్వలేదు. కానీ మీ సహజ గుణాన్ని బయటపెడుతున్నారు. ఈ వంద రోజుల్లో రాష్టాభివృద్ధి కోసం మీరు చేసిందేంటో గర్వంగా ఒక్క మాట చెప్పండని కన్నా నిలదీశారు. భేషజాలకు పోకుండా నిర్ణయాలను సమీక్షించుకోవాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.