యాప్నగరం

ఏపీ ప్రజలకు శుభవార్త.. సంక్షేమ పథకాల తేదీలు వచ్చేశాయ్.. మీ అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు పడతాయంటే!

ఎన్నికల కోడ్ కారణంలో రాష్ట్రంలో నిలిచిపోయిన సంక్షేమ పథకాలు.. కొద్ది రోజుల్లో అమలు కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలు తారీఖులను మంగళవారం ఖరారు చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 8 Mar 2023, 12:35 am
రాష్ట్రానికి ఆర్థిక ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, పథకాల అమలుకు బ్రేక్‌ పడింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే వరుసగా కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు.
Samayam Telugu సీఎం జగన్మోహన్ రెడ్డి (ఫైల్ ఫొటో)


ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మంగళవారం సీఎం జగన్మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీలను ఫైనల్‌ చేశారు. ముందుగా ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనం పథకంలో కొత్త మెనూ అమలును ప్రారంభించనున్నారు.

ఇక, మార్చి 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూలు.. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే విషయాన్ని ఖరారు చేయనున్నారు.

మార్చి 18వ తేదీన సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం, జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో నగదు జమ చేయనున్నారు. మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన గ్రామ, వార్డు వాలంటీర్ల పేర్లు ప్రకటించనున్నారు. వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు అందజేయనున్నారు. మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభించనున్నారు.

మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు వైయస్సార్‌ ఆసరా కొనసాగనుంది. మార్చి 31న జగనన్న వసతి దీవెన, ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు, ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం, ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం.. ఇలా వరుస కార్యక్రమాలు, పథకాలను ప్రభుత్వం అమలు చేయనుంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.