యాప్నగరం

ఏపీలో రైతులకు తీపి కబురు.. రేపు అకౌంట్లలో డబ్బు జమ

రాష్ట్రవ్యాప్తంగా 6,27,908 మంది రైతులకు రూ.128.47 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.. ఈ నెల 20న నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా..

Samayam Telugu 19 Apr 2021, 6:18 am

ప్రధానాంశాలు:

  • వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం
  • రైతుల అకౌంట్లలో డబ్బు జమ
  • సీఎం జగన్ చేతుల మీదుగా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఏపీలో రైతులకు శుభవార్త
ఏపీలో రైతులకు శుభవార్త.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద సున్నా వడ్డీ రాయితీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రబీ–2019 సీజన్‌కు ఈ–క్రాప్‌ నిబంధనతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ వడ్డీ రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 6,27,908 మంది రైతులకు రూ.128.47 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.. ఈ నెల 20న నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. వ్యవసాయ అవసరాల కోసం రూ.లక్షలోపు పంట రుణాన్ని తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించిన రైతులకు వారు కట్టిన వడ్డీ (4 శాతం) మొత్తాన్ని వడ్డీ లేని రుణ పథకం కింద గతంలో బ్యాంకులకు జమ చేసేవారు.
రైతులు రుణాలు సకాలంలో చెల్లించినా ఎప్పుడో రెండు మూడేళ్లకు ప్రభుత్వం జమ చేసే ఈ మొత్తాన్ని అప్పులిచ్చే సమయంలో బ్యాంకర్లు సర్దుబాటు చేసుకునే వారు. ఇప్పుడు రూ.లక్షలోపు పంట రుణాలపై రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ అకౌంట్‌లలోకి జమ చేయాలని ప్రభుత్వం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్‌–2019 సీజన్‌లో 43,28,067 మంది రుణాలు పొందగా.. వారిలో 25,96,840 మంది రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారున్నారు. నిర్ణీత గడువులోగా వడ్డీతో సహా చెల్లించిన 14.25 లక్షల మంది ఈ పథకం కింద అర్హత పొందారు. వీరికి వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ కింద గతేడాది నవంబర్‌లో రూ.289.41 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది.

రబీ–2019–20 సీజన్‌లో 28,08,830 మంది రుణాలు పొందగా.. వారిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారు 16,85,298 మంది ఉన్నారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన వారిలో ఇప్పటివరకు 6,27,908 మంది రైతుల వివరాలను సున్న వడ్డీ పథకం రుణాలు పోర్టల్‌లో బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ క్రాప్ నిబంధనను పక్కన పెట్టారు. వడ్డీ లేని రుణ పథకం కింద 2014–15 నుంచి 2018–19 మధ్య గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలను చెల్లించారు. ఈ విధంగా 35 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.789.36 కోట్లను సున్నా వడ్డీ రాయితీ కింద ప్రభుత్వం జమ చేసింది.

రబీ 2019–20 సీజన్‌కు సంబంధించి వాస్తవ సాగుదారులకు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేశామన్నారు అధికారులు. అయితే ఎస్‌వీపీఆర్‌ పోర్టల్‌లో బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేసిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలిచ్చారని.. బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేసిన జాబితాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకూ వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ అందనుంది అన్నారు. ఈ నెల 20న ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.