యాప్నగరం

నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. ఆ రోజే ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న జరపుకోవాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. కేంద్రం సూచనల మేరకే ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా రాష్ట్రం అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకోబోతోంది.

Samayam Telugu 18 Oct 2019, 5:01 pm
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలిసారి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోనుంది. గత ఐదేళ్లూ చంద్రబాబు హయాంలో ఏపీ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేదు. జూన్ 2న తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతుండగా... చంద్రబాబు ఆ రోజును ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. నవనిర్మాణ దీక్ష పేరిట దీక్షలు నిర్వహించేవారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడంతో పరిస్థితి మారింది.
Samayam Telugu ap


ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌ 1న నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరపాలో తెలపాలని చంద్రబాబు హయాంలో అధికారులు కేంద్ర హోం శాఖను కోరారు. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ఒరిజనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.

దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు ఆ విభజన తేదీ నాడే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీ నాడు దినోత్సవాలనే చేసుకుంటున్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. దీంతో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా ఏపీ సర్కారు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ విడిపోయాక మిగిలిపోయిన రాష్ట్రం.. 1953లో ఏర్పాటైన ఆంధ్రరాష్ట్రం భౌగోళికంగా ఒక్కటే. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైంది. దీంతో ఆ రోజునే రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.