యాప్నగరం

'కేసీఆర్, జగన్ స్నేహితులు కదా.. ఏపీ సీఎం అలా చేస్తే బావుంటుంది'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మంచి స్నేహితులు.. సత్సంబంధాలు ఉన్నాయి కదా. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిల విషయంలో జగన్ చొరవ చూపించాలి.

Samayam Telugu 10 Oct 2019, 12:15 pm
తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చొరవ చూపించాలన్నారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. కేసీఆర్‌, జగన్‌ స్నేహితులు.. మంచి సంబంధాలు ఉన్నాయని.. విభజన అంశాలు త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ అంశాలను పరిష్కరించే విషయంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన కన్నా.. శుక్రవారం బీజేపీ బృందం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నట్లు చెప్పారు.
Samayam Telugu jagan


పోలవరం పనుల్ని పరిశీలించేందుకే బీజేపీ బృందం పర్యటన అంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ. ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించి.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో పోలవరంలో ఏం చేసిందో పరిశీలిస్తామన్నారు. తర్వాత ఈ నెల 13న ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిని కలవబోతున్నట్లు తెలిపారు. పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.

ఇక పోలవరం టెండర్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని.. ఇక జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌తో రూ. 800 కోట్లు ఆదా చేశారా లేదా అన్నది ఫైనల్ బిల్లు వస్తే గాని తెలియదన్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి చంద్రబాబు జర్మనీ సామాగ్రి తీసుకురావాలని భావిస్తే.. జగన్ చైనావి తెప్పిస్తున్నట్లు తెలిసిందన్నారు. వ్యయం తగ్గడం మంచిదేనని.. నాణ్యతను దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

అధికారంలోకి రాగానే 4లక్షలకు మందికిపైగా ఉద్యోగుల్ని తీసుకోవడం చూస్తుంటే.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో లేదని భావిస్తున్నాను అన్నారు. జగన్ వారి కార్యకర్తలకు పంపకాలు బాగానే చేస్తున్నారు అంటూ సెటైర్లు పేల్చారు కన్నా లక్ష్మీనారాయణ. ఉద్యోగాలన్నీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకే కట్టబెట్టారని పరోక్షంగా విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.