యాప్నగరం

YS Jagan కేబినెట్ భేటీ.. మండలి రద్దుకే నిర్ణయం!

ఊహించిందే జరిగింది. మండలి రద్దుకే ఏపీ కేబినెట్ మొగ్గు చూపింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపుతారు.

Samayam Telugu 27 Jan 2020, 10:16 am
శాసన మండలి రద్దుపై చర్చించడం కోసం ఏపీ కేబినెట్ సోమవారం ఉదయం భేటీ అయ్యింది. సచివాలయం బ్లాక్‌-1లో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. శాసన మండలి రద్దుకే మంత్రి మండలి మొగ్గు చూపిందని సమాచారం. రాజ్యాంగ అధికరణ 169(1) ప్రకారం రద్దు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలుస్తోంది. వెంటనే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించి.. అనంతరం తీర్మానం ప్రతిని కేంద్రానికి పంపనున్నారు. గత సోమవారమే ఏపీ కేబినెట్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు లాంటి కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆరోజు ఆమోదం తెలిపింది. శాసన సభలో ఈ రెండు బిల్లులు ఆమోదం పొందగా.. శాసన మండలిలో మాత్రం భిన్నమైన ఫలితం వచ్చింది. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు.
Samayam Telugu ap cabinet


2019 ఎన్నికల్లో ఓడిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలను ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. శాసన మండలిని రద్దు చేయాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ గురువారం జగన్‌ ముందు ప్రతిపాదించారు. మండలి రద్దయితే సుభాష్ చంద్రబోస్, మోపిదేవి మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది.

శాసన మండలిలో టీడీపీ వ్యవహరించిన తీరుపట్ల, చైర్మన్ తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి మండలి మనకు అవసరమా అనేది ఆలోచించాలన్నారు. మండలి నిర్వహణకు ఏటా రూ.60 కోట్లు ఖర్చవుతుందన్నారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన జగన్.. మండలి రద్దు దిశగా సంకేతాలిచ్చారు. సోమవారం శాసన సభలో ఈ విషయమై చర్చిద్దామన్నారు. మూడు రోజుల్లో మండలి రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Read Also: మండలి రద్దు.. వైఎస్ ఫార్ములాతో వాళ్లకు పదవులు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా కేబినెట్‌ భేటీలో చర్చించారని తెలుస్తోంది. అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినం రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చ జరిగిందని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.