యాప్నగరం

YSRCP ఎంపీ రఘురామకు సీఎం జగన్ షాక్.. పిలిచినట్లే పిలిచి వద్దన్నారు.. బహిష్కరించినట్లే!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఝలక్ ఇచ్చారు.

Samayam Telugu 14 Sep 2020, 6:52 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అయితే పార్టీ సమీక్షకు ఎంపీ రఘురామను మొదట పిలిచి.. వెంటనే వద్దన్నారు. దీనిపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సమీక్షకు తనను పిలిచినట్లే పిలిచి, అంతలోనే ఆంధ్రాభవన్‌ అధికారులు వద్దని చెప్పారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వెల్లడించారు.
Samayam Telugu రఘురామ కృష్ణంరాజు, సీఎం జగన్


ఇక తనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లే భావిస్తున్నానని ఎంపీ రఘురామ తెలిపారు. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని చెప్పి మాట తప్పిన వారే రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు.

తాను ఫలానా ఎక్స్ బొమ్మ పెట్టుకుని గెలిచానంటున్నారని, అయితే తన ముఖంతోనే గెలిచానని ఎంపీ రఘురామ తేల్చి చెప్పారు. తన ముఖం చూసే ప్రజలు బటన్ నొక్కారని, ఆ విషయం ప్రజలకు కూడా తెలుసన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి.. వెనకడుగు వేశారని, ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లారు కాబట్టి మీరే మూకుమ్మడిగా రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తే మీరు, మీ మంత్రివర్గం చేయాలే తప్ప.. తాను మాత్రం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సాక్షిగా తాను పార్టీకి విధేయుడినని, పార్టీ ఆనాడు చెప్పిన మాటనే గుర్తు చేస్తున్నానని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.