యాప్నగరం

బిగ్ అలర్ట్: అమ్మఒడికి కొత్త రూల్.. ఇక, రూ. 15 వేలు రావాలంటే.. సీఎం జగన్ సంచలన ఆదేశాలు!

అమ్మఒడి పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు. పథకం వర్తించాలంటే కచ్చితంగా..!

Samayam Telugu 11 Oct 2021, 7:35 pm
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమ్మఒడి పథకం రావాలంటే కచ్చితంగా ఈ రూల్ పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ ఏడాది నుంచి అమ్మ ఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాలని ఇది వరకే నిర్ణయించామనీ, ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నిబంధనను అమలు చేయాలని తేల్చి చెప్పారు.
Samayam Telugu జగనన్న అమ్మ ఒడి


రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుక వంటి అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులు, విద్యార్థుల హాజరుపై సీఎం ఆరా తీశారు. 2024 నాటికి విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలన్నారు. స్కూళ్ల పనితీరుపై ర్యాంకింగ్‌లు ఇస్తామని అధికారులు ప్రతిపాదించగా.. ఏ మార్పులైనా ఉపాధ్యాయులతో చర్చించాలని సూచించారు.

అలాగే, ఎయిడెడ్‌ పాఠశాలలను విలీనం చేయాలని బలవంతం చేయట్లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. స్కూళ్ల అప్పగింత అనేది స్వచ్ఛందం అనే విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. ఎయిడెడ్‌ యాజమాన్యాలు అప్పగిస్తే ప్రభుత్వమే పాఠశాలలను నడుపుతుందని స్పష్టం చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏడాది రూ. 15 వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. ఇప్పటికే రెండేళ్ల పాటు అమ్మఒడి పథకం కింద లక్షలాది మందికి పథకాన్ని అందించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.