యాప్నగరం

తిరుమల చేరుకున్న సీఎం జగన్.. శ్రీవారి ఆలయ డిక్లరేషన్‌పై సంతకం పెడతారా?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే డిక్లరేషన్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.

Samayam Telugu 23 Sep 2020, 4:20 pm
ఎన్నో వివాదాల నడుమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో సీఎం జగన్ ఆచరించే క్రైస్తవ మతం ప్రస్తావన ముందుకొచ్చింది. గత పదేళ్లలో సీఎం జగన్ పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్నా డిక్లరేషన్ ప్రస్తావన పెద్దగా రాలేదు. అయితే ఈ సారి మాత్రం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏకంగా సీఎం జగన్ అన్య మతస్తుడైనందు వల్ల కచ్చితంగా డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Samayam Telugu సీఎం జగన్ డిక్లరేషన్


ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. ఢిల్లీ నుంచి నేరుగా బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పించేందుకు గాను రోడ్డు మార్గంలో తిరుమల బయల్దేరి వెళ్లారు. రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం సాయంత్రం 5.27 గంటలకు అన్నమయ్య భవన్ నుంచి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7.30కి శ్రీవారి గరుడ సేవలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ తర్వాత ఈ నెల 24న అంటే గురువారం ఉదయం 6.15 గంటలకు సీఎం జగన్ మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. 24న ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుందరకాండ పఠనంలో పాల్గొంటారు. 24న ఉదయం 8.10కి కర్ణాటక చౌల్ట్రీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి 24న రాత్రి 10.20కి రేణిగుంట నుంచి గన్నవరం బయల్దేరుతారు.

అయితే తిరుమలలో సీఎం జగన్ డిక్లరేషన్‌ వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. అసలు తిరుమలలో అసలు డిక్లరేషన్ విధానాన్నే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో కొడాలి నాని వ్యాఖ్యలను టీడీపీ, బీజేపీలు తీవ్రంగా ఖండించాయి.

తాజాగా డిక్లరేషన్‌ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అన్యమతస్థుడైన ముఖ్యమంత్రి డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్‌ డిక్లరేషన్‌ కోసం పట్టుబట్టాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్యమతస్థులు డిక్లరేషన్‌ ఇచ్చాకే తిరుమల ఆలయంలో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టు వస్త్రాలిస్తే రాష్ట్రానికే అరిష్టమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై బుధవారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలపాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి తరుణంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే సమయంలో సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెడతారా? లేదా? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.