యాప్నగరం

Amaravati: ‘రాజధాని మార్పుపై ప్రధానికి జగన్ రహస్య లేఖ.. ఫలానా చోట భూములు కొనుక్కోమని..’

CRDA పరిధిలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ లబ్ధి పొందారనే కారణంతో రాజధానిని మారుస్తున్నారు. రాజధాని మార్పుపై ప్రధాని మోదీకి జగన్ రహస్య లేఖ రాశారు. ఫలానా చోట భూములు కనుక్కోమని పార్టీ నేతలకు జగన్ సూచించారు - దేవినేని ఉమా.

Samayam Telugu 21 Aug 2019, 9:00 pm
ఏపీ రాజధాని అమరావతి అంశం రాజకీయంగా వివాదాస్పదం అవుతోంది. మంత్రి బొత్స మంగళవారం చేసిన వ్యాఖ్యలతో రాజధాని మార్పు ఖాయమే అనే అభిప్రాయం జనాల్లో ఏర్పడుతోంది. బొత్స వ్యాఖ్యల పట్ల మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. రాజధాని అంశంపై టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అమెరికా పర్యటనకు ముందే ఫలానా ప్రాంతంలో భూములు కొనుక్కోమని తమ నేతలకు చెప్పారా? లేదా? అని దేవినేని ప్రశ్నించారు.
Samayam Telugu jagan modi


విజయవాడలోని టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా మహేశ్వరరావు.. జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నవ్యాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు పరుగులు పెట్టించారని.. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక అన్ని అభివృద్ధి పనులు నిలిపివేశారని దేవినేని ఉమా విమర్శించారు. కృష్ణపట్నం పోర్టు కొట్టేయాలని చూశారని కుదరకపోవడంతో.. పోలవరం పనులు, బందర్ పోర్టు రద్దు చేశారని విమర్శించారు.

రాజధానిని మార్చేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారని దేవినేని ఉమా ఆరోపించారు. ప్రపంచస్థాయి రాజధాని అమరావతిపై అసెంబ్లీలో చర్చ జరిగితే నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని దేవినేని గుర్తు చేశారు. సీఎం జగన్ అమెరికా పర్యటనకు వెళ్తూ.. తమ నేతలకు ఫలానా ప్రాంతంలో భూములు కొనుక్కోమని చెప్పారా లేదా అని ప్రశ్నించారు. మీకు సీట్లు ఇవ్వలేకపోయా, అక్కడ భూములు కొనండి, లాభం జరుగుతుందని చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

రాజధాని మార్చడానికి కేంద్రం అనుమతి తీసుకున్నారా? అని సీఎంను దేవినేని ఉమా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో సొంత ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. రాజధాని మారుస్తామని బొత్స చెప్పాక, విజయసాయిరెడ్డి ఎవరు మధ్యలో అని ప్రశ్నించారు.

‘‘ట్విట్టర్ పులి.. విజయసాయి రెడ్డి.. నువ్వు ట్వీట్‌లు చేసుకో.. విజయసాయి రెడ్డి ఒక జోకర్‌లా పెట్టే ట్వీట్‌లు చూసి ప్రజలు నవ్వుతున్నారు. సీఆర్డీయే పరిధిలో ఒక కులానికి చెందిన వ్యక్తులు లబ్ధి పొందారని కేంద్రానికి మీరు రాసిన లేఖ బయట పెట్టాలి’’ అని దేవినేని డిమాండ్ చేశారు.

జగన్ అసమర్థ పాలన, చేతకానితనం చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి రాజధాని మార్పు డ్రామాకు తెరలేపారని ఆరోపించిన దేవినేని.. ఏపీ రాజధానిని ఇడుపులపాయకు తీసుకెళ్లేందుకు సీఎం కుట్రలు పన్నుతున్నారన్నారు. అమరావతి ప్రాంతంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన 85 శాతం మంది లబ్ధి పొందారని జగన్ ప్రధాని లేఖ రాశాని దేవినేని ఆరోపించారు.

రాజధాని విషయంలో ప్రధానికి సీఎం సమర్పించిన రిప్రజంటేషన్‌లో ఏముందో బయట పెట్టాలని దేవినేని డిమాండ్ చేశారు. దేవుడి పాలనలో అంత గోప్యత ఎందుకని నిలదీశారు. రాజధాని మార్పు, ప్రధానికి లేఖ లాంటి అంశాలపై జగన్ అమెరికా నుంచి ట్విట్టర్ ద్వారా అయినా స్పందించాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.