యాప్నగరం

వివేకానంద రెడ్డి హత్య, జగన్‌‌పై చిన్నమ్మ ఆగ్రహం.. రంగంలోకి దిగిన డీజీపీ

YS Jagan | వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు అవుతోంది. కానీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విచారణ మాత్రం పూర్తి కాలేదు. ఈ కేసు సంగతి తేల్చడం కోసం జగన్ డీజీపీని రంగంలోకి దించారు.

Samayam Telugu 4 Sep 2019, 2:39 pm
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు గడిచింది. పాలనపై తనదైన మార్క్ వేస్తోన్న జగన్.. ఓ విషయంలో మాత్రం అసంతృప్తితో ఉన్నారు. జగన్ ఒక్కరే కాదు.. ఆయన కుటుంబ సభ్యులంతా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. అదే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చిక్కుముడి. సాక్షాత్తూ ఏపీ సీఎం సొంత బాబాయి మర్డర్ కేసు మిస్టరీ వీడకపోవడం ఆశ్చర్యం కలుగుతోంది. ఎన్నికల ముందు సొంత ఇంట్లో వివేకానంద హత్యకు గురయ్యారు. తొలుత ఆయన గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారని వార్తలొచ్చాయి. తర్వాత అది హత్య అని తేలింది.
Samayam Telugu ysj cm


వివేకానంద రెడ్డి హత్య మిస్టరీని తేల్చడం కోసం సీబీఐతో విచారణ జరపాలని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ హత్య వెనుక టీడీపీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. మరో వైపు టీడీపీ కూడా ఇది ఇంటి హత్య అని ఆరోపించింది. వైఎస్ఆర్సీపీకి చెందిన వారే ఆయన్ను హత్య చేశారని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ విమర్శల సంగతి పక్కనబెడితే.. జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టి 100 రోజులు అవుతున్నా.. హత్య కేసును పోలీసులు చేధించలేకపోయారు.

వైఎస్ వర్ధంతి సందర్భంగా పులివెందుల వెళ్లిన జగన్.. వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాస్తవానికి ఆగష్టు నెలలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండాల్సింది. కానీ జగన్ ఢిల్లీ పర్యటనను పొడిగించుకోవడంతో అప్పుడు సాధ్యపడలేదు.

వివేకానంద రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో.. ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కానీ వివేకానంద సతీమణి సౌభాగ్యమ్మ మాత్రం పాల్గొనలేదు. అంతకు ముందే జగన్ వెళ్లి ఆమెతో మాట్లాడి వచ్చారు. తన భర్తను హత్య చేసింది ఎవరో తేల్చకపోవడంపై ఆమె అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అందుకే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాలేదని ప్రచారం జరుగుతోంది.

Read Also: పవన్‌కు ‘పెద్ద’ ఎనర్జీ వస్తుంది.. ఆయన్నెవరూ ఆపలేరు: బీజేపీ నేత

ఈ విషయంలో స్వయంగా తాను కూడా అసంతృప్తితోనే ఉన్న జగన్.. ఏపీ డీజీపీపై అసహనం వ్యక్తం చేశారు. మీరేం చేస్తారో తెలీదు.. చిన్నాన్న హత్య కేసు మిస్టరీ తేల్చమని ఆదేశించారు. హంతకులు ఎవరైనా ఉపేక్షించొద్దని సీఎం సూచించడంతో.. ఈ కేసు సంగతి తేల్చడానికి డీజీపీ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం రాత్రే ఆయన రోడ్డు మార్గం ద్వారా కడప బయల్దేరి వెళ్లారు.

ఇప్పటికే పోలీసుల ఒత్తిడి ఎక్కువ కావడంతో.. వివేకానంద హత్య కేసులో నిందితుడుగా భావిస్తోన్న శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు డీజీపీ స్వయంగా రంగంలోకి దిగడంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.