యాప్నగరం

మాచర్ల ఘటనలో నిందితుడికి వెనువెంటనే బెయిలా? ఈసీ విస్మయం.. సీఐపై సస్పెన్షన్ వేటు

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను ఏపీ ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది.

Samayam Telugu 15 Mar 2020, 1:12 pm
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియలో చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలపై ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి జరిగిన పలు హింసాత్మక ఘటనలను ఈసీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి ప్రభుత్వ అధికారులు పలు ప్రాంతాల్లో కొమ్ముకాసినట్టు తమకు ఫిర్యాదులు అందాయని, ముఖ్యంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపించిందన్నారు.
Samayam Telugu pjimage (48)


ఈ జిల్లాల్లో ఘటనలు జరిగిన ప్రాంతాల్లోని అధికారులను విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నామని ఆయన తెలిపారు. గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, గుంటూరు గ్రామీణ ఎస్పీ సీహెచ్ విజయరావు, మాచర్ల సీఐ రాజేశ్వరరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ల స్థానంలో వేరొకరిని నియమించాలని ఆయన అన్నారు.

మాచర్లలో జరిగిన ఘటన తరువాత, నిందితులను అరెస్ట్ చేసి వెనువెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం, ఉదాసీన వైఖరితో కేసులు నమోదు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ ఘటనలను అదుపుచేయడంలో ఆ ప్రాంత సీఐ విఫలమయ్యారని, దీనికి ఆయనదే బాధ్యతని, వెంటనే అతన్ని కూడా విధుల నుంచి తప్పించాలని సిఫార్సు చేస్తున్నట్టు రమేశ్ కుమార్ వెల్లడించారు. హింసాత్మక ఘటనలు జరిగిన మరికొన్ని ప్రాంతాల పోలీసు అధికారులను కూడా బదిలీ చేయాలని సూచించినట్టు ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తక్షణం బదిలీ చేయాలని సిఫార్సు చేసినట్టు తెలిపారు.

స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో జరిగిన పరిణామాలు బాధాకరమని, బెదిరింపులు, అభ్యర్థులను అడ్డుకున్న దృశ్యాలు మాధ్యమాల్లో వచ్చాయన్నారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడం అనివార్యంగా భావిస్తున్నామని, అధికార యంత్రాంగం పూర్తి పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మహిళలు, బలహీన వర్గాల అభ్యర్థులపై దాడులు జరగడం శోచనీయమని, ప్రభుత్వ యంత్రాంగం నుంచి మరింత అప్రమత్తతను మలిదశ ఎన్నికల్లో ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. జరిగిన అన్ని హింసాత్మక ఘటనలనూ పరిశీలిస్తున్నామని, ఈ ప్రాంతాల్లో అవసరమైన చోట్ల ఇంతవరకూ జరిగిన ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసి, కొత్త షెడ్యూల్ ను ప్రకటిస్తామని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.