యాప్నగరం

సింగర్ మంగ్లీకి ఏపీలో కీలక పదవి.. జగన్ సర్కారు ఉత్తర్వులు!

Singer Mangli: ప్రముఖ సింగర్ మంగ్లీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఈ మేరకు జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ప్రభుత్వం పోసాని కృష్ణమురళి, ఆలీకి సైతం కీలక పదవులు దక్కిన విషయం తెలిసిందే.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 22 Nov 2022, 12:08 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ సింగర్ సత్యవతి మంగ్లీ రాథోడ్‌కు కీలక పదవి కట్టబెట్టింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా మంగ్లీని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం, బసినేపల్లె తాండకు చెందిన మంగ్లీ.. బోనాలు పాటలతో ఫేమస్ అయ్యారు. కంచు కంఠంతో శ్రోతలను ఉర్రూతలూగించేలా పాటలు పాడుతూ అశేష అభిమానులను సంపాదించుకున్నారు.
Samayam Telugu సీఎం జగన్‌తో మంగ్లీ (ఫైల్ ఫొటో)


తొలుత తెలంగాణ జానపద గీతాలతో ఫేమస్ అయిన మంగ్లీ (Mangli Songs).. తర్వాత సినిమాల్లోనూ సింగర్‌గా బిజీ అయ్యారు. గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పాడిన పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా గతంలో మంగ్లీ కలిశారు.


ఎన్నికలు మరో ఏడాదిన్నరలో రానున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగ్లీకి ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే మంగ్లీని ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడగా.. ఇటీవలే ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండేళ్ల పాటు మంగ్లీ (Mangli) ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆమెకు ప్రభుత్వం నెలకు లక్ష రూపాయిలు జీతంగా చెల్లించనుంది.

కాగా, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులకు కూడా ఇటీవలే సీఎం జగన్ కీలక పదవులు కట్టబెట్టారు. నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. అలాగే, ప్రముఖ కమెడియన్ ఆలీని ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహాదారు పదవి వరించింది. తాజాగా, మంగ్లీని ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమించారు. మరో ఏడాదిన్నలో రాష్ట్రంలో ఎన్నికలు రానున్న తరుణంలో వీరి సేవలను మరింతగా ఉపయోగించుకోవడం కోసమే ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.