యాప్నగరం

వివేకా హత్య కేసు సీబీఐకేనా..? తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించడంపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.

Samayam Telugu 24 Feb 2020, 7:16 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టులో విచారణ పూర్తయింది. విచారణలో భాగంగా సేకరించిన పోస్టుమార్టం నివేదిక, జనరల్‌ కేసు డైరీని పోలీసులు కోర్టుకు సమర్పించారు. మరోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు మెమో దాఖలు చేయడంపై వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు.
Samayam Telugu viveka 4


గతంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దానిపై వివేకా కుమార్తె తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టును కోరారు. సునీతతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని గతంలో పిటిషన్ వేశారు.

అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం వివేకా హత్య కేసులో విచారణ ముగింపు దశకు చేరుకుందని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని చెప్పింది. సిట్ దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. త్వరలో ఈ కేసుపై తుది తీర్పు వెలువరించే అవకాశముంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.