యాప్నగరం

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ.. జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని సస్పెండ్ చేసిన హైకోర్టు

గతంలో నిమ్మగడ్డ ప్రసాద్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పదవి నుంచి తప్పించి జస్టిస్ కనగరాజ్‌ను జగన్ నియమించారు. అయితే, ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Samayam Telugu 16 Sep 2021, 5:12 pm
పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజ్‌ నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ జీవోను ఆరు వారాలపాటు సస్పెండ్ చేస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని న్యాయవాది పారా కిషోర్ సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. జీవోను ఆరు వారాలు సస్పెండ్ చేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది ఇంద్రనీల్ వాదనలు వినిపించారు.
Samayam Telugu జస్టిస్ కనగరాజ్


జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం ఏపీ పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ నిబంధన 4(ఏ)కి విరుద్ధంగా జరిగిందన్నారు. జస్టిస్‌ కనగరాజ్‌కు ప్రస్తుతం 78 ఏళ్లని.. అయితే అథారిటీ చైర్మన్‌ నిబంధనల ప్రకారం 65 ఏళ్లు వచ్చే వరకే ఆ పదవిలో ఉంటారన్నారు. వయసురీత్యా అర్హత లేని వ్యక్తిని ఆ పదవిలో నియమించారని.. ప్రకాశ్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించిందని పిటిషనర్ తరఫున లాయర్ కోర్టుకు వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. జస్టిస్ కనగరాజ్ నియామకం జీవోను నిలుపుదల చేసింది.

అదనపు ఎస్పీ, అంతకంటే పై స్థాయి పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదుల్ని కంప్లైంట్ అథారిటీ విచారిస్తుంది. తీవ్రమైన దుష్ప్రవర్తన, పోలీసు కస్టడీలో మృతి, దాడి, అత్యాచారం వంటి ఘటనలు జరిగిన సందర్భంలో వాటికి సంబంధించిన ఫిర్యాదుల విచారణకు దీనిని ఏర్పాటు చేశారు. ఏపీ ప్రభుత్వం పోలీసు ఫిర్యాదుల అథారిటీకి జస్టిస్ వి కనకరాజ్‌ను ఛైర్మన్‌గా.. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కేవీవీ గోపాలరావు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బి.కిశోర్‌, ఉదయలక్ష్మిల సభ్యులుగా నియమించింది.

మూడు జిల్లాలకు ఒక ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులను నియమించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ఛైర్మన్‌గా వరప్రసాదరావు, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు ఛైర్మన్‌గా విశ్రాంత జిల్లా జడ్జి ఆర్‌జే విశ్వనాథం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఛైర్మన్‌గా నేతల రమేశ్‌బాబు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతరం జిల్లాలకు ఛైర్మన్‌గా వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. జిల్లాల కమిటీ సభ్యులుగా విశ్రాంత విశ్రాంత కలెక్టర్‌లు, డీఎస్పీలను నియమించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.