యాప్నగరం

జగన్ సర్కారుకు భారీ షాక్.. ఆ బిల్లుల ఊసే లేకుండా మండలి నిరవధిక వాయిదా

శాసన మండలిలో వైసీపీ సర్కార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కీలక బిల్లుల ఆమోదం లేకుండా సభను నిరవధికంగా వాయిదా వేశారు.

Samayam Telugu 17 Jun 2020, 9:22 pm
వైసీపీ ప్రభుత్వానికి శాసన మండలిలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక బిల్లుల ఆమోదం లేకుండానే మండలి డిప్యూటీ చైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అంతకుముందు సభలో ద్రవ్య వినిమయ బిల్లును పెట్టాలని ప్రతిపక్ష టీడీపీ, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు పెట్టాలని అధికారపక్షం మధ్య వాగ్వాదం నడిచింది.
Samayam Telugu శాసన మండలి1


చివరకు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టాలని డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధికారపక్షాన్ని ఆదేశించారు. అయితే అధికారపక్షం చర్చ ప్రారంభించకపోవడంతో రూల్ నంబర్ 90పై చర్చను చేపట్టాలని మండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడుకు రెడ్డి సుబ్రమణ్యం సూచించారు. దీంతో రూల్ నంబర్ 90 కింద యనమల చర్చను ప్రారంభించారు. దీంతో యనమల ప్రసంగాన్ని అధికారపక్షం నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది.

చివరకు సభ ఆర్డర్‌లో లేకపోవడంతో శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వికేంద్రీకరణ బిల్లులు, ద్రవ్య వినిమయ బిల్లుల ఆమోదం లేకుండానే సభ వాయిదా పడింది. వాయిదా ప్రకటన అనంతరం అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ఫొటోలు తీస్తున్నారంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మంత్రి వెల్లంపల్లిని టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అడ్డుకున్నారు. ఈ సమయంలో బీద రవిచంద్ర, వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకోగా.. మిగిలిన సభ్యులు వీరిని విడదీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.