యాప్నగరం

ఎలక్షన్ కమిషనర్‌తో అధికారుల భేటీ.. ఏక కాలంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు?

ఏపీలో ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మార్చి 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మార్చి 24న మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. మార్చి 27న పంచాయతీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.

Samayam Telugu 5 Mar 2020, 10:13 pm
ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జగన్ సర్కారు భావిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ; 24న మున్సిపల్, 27న పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌తో గురువారం భేటీ అయ్యారు. పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ స్థానాలకు వేర్వేరు తేదీల్లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై ప్రభుత్వ ప్రతిపాదనలను వారు ఈసీ ముందుంచారు.
Samayam Telugu parishad elections


గ్రామ పంచాయితీలకు నూరు శాతం గ్రాంట్ మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. దీని ప్రకారం 2018-20 మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏపీకి రూ.4,065.79 కోట్లు కేటాయించారు. తొలి విడతగా రూ.858.99 కోట్లు మంజూరు చేశారు. మిగతా మొత్తం రెండో దఫాలో రావాల్సి ఉంది. కానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నిధులను మంజూరు చేయడం లేదు. మార్చి 31తో 14వ ఆర్థిక సంఘం గడువు ముగిసిపోతుండటంతో.. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని అధికారులు ఎన్నికల కమిషనర్‌ను కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల విషయంపై శుక్రవారం జిల్లా అధికారుల, ఎస్పీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల సూచనలను, సలహాలను స్వీకరిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.