యాప్నగరం

అచ్చెన్నాయుడుకు వారి నుంచి ప్రాణహాని.. డీజీపీకి లేఖ

సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్ల నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి ఆయన ఓ లేఖ రాశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 11 May 2022, 7:19 am
సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, ఇతర క్రిమినల్స్‌తో తనకు ప్రాణహాని ఉందని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి అచ్చెన్న లేఖ రాశారు. సంఘ విద్రోహశక్తులు, నేరస్థులతో తనకు ప్రాణాపాయం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు కల్పిస్తున్న 1+1 భద్రతను 4+4కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu అచ్చెన్నాయుడు


ఇకపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టే క్రమంలో తాను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగానూ వ్యవహరిస్తున్నందున తాను కోరిన అదనపు భద్రత కల్పించాలని డీజీపీని కోరారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఇటీవలే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన సీఎం జగన్.. సీనియర్ నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించారు.

పొత్తుల కోసం జనసేన వంటి పార్టీలకు స్నేహహస్తం చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నానని, భద్రత పెంచాలంటూ అచ్చెన్నాయుడు డీజీపీ లేఖ రాయడం విశేషం. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటి నుంచే వేగంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టత వచ్చిన తరుణంలో అచ్చెన్న లేఖపై డీజీపీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.