యాప్నగరం

‘కేంద్రం మెడలు జగన్ వంచేటప్పుడు విజయసాయిరెడ్డి లెక్కపెట్టడం మరిచిపోయారా?’

ఎన్నికల ముందు హోదాపై ప్రగల్భాలు పలికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీరా ఎన్నికలయ్యాక నోరు విప్పడంలేదు ఎందుకుని టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ప్రశ్నించారు.

Samayam Telugu 12 Jul 2020, 10:32 am
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. జగన్‌ను నిరుద్యోగ ద్రోహిగా అభివర్ణించిన ఆయన.. వైఎస్‌ఆర్‌సీపీలో రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి... లక్షలాది నిరుద్యోగులను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచుతామని శపథం చేశారని, తీరా ఎన్నికలయ్యాక ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. హోదా తెస్తా, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాన్న జగన్.. నిరుద్యోగ యువత గురించి పట్టించుకోవటం లేదని ఆరోపించారు.
Samayam Telugu జగన్‌పై కళా విమర్శలు
TDP President Kala venkata Rao


ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 3 లక్షల ఉద్యోగాలు తొలగించారన్నారు. తన 13 నెలల పాలనలో నిరుద్యోగులకు ఒక్క శాశ్వత ఉద్యోగమైనా జగన్ ఇచ్చారా? ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? అని కళా ప్రశ్నించారు. ‘ఉద్యోగాల భర్తీ అంటే మీ తాబేదార్లను సలహాదారులుగా నియమించడమా? లేక ఒకే సామాజికవర్గానికి పదవులు కట్టబెట్టడమా?’ అని నిలదీశారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలన్న జగన్ పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారిని సలహాదారులుగా నియమించడ వాస్తవం కాదా? అని వ్యాఖ్యానించారు.

వర్షాల కోసం రైతులు ఎదురు చూసినట్లు నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని కళావెంకట్రావు ఎద్దేవా చేశారు. పోటీ పరీక్షల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ పొందిన నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ధ్వజమెత్తారు. పదో తరగతి కూడా పాసవ్వని కొడాలి నానికి మంత్రిగా ఉద్యోగం ఇచ్చిన జగన్.. డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ చేసిన వాళ్లని వైన్ షాపుల్లో బేరర్లుగా మార్చారని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో శాసించే స్థాయిలో ఉన్న యువతను వైసీపీ ప్రభుత్వం యాచించే స్థాయికి దిగజార్చిందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని... ఉద్యోగులకు జీతాలు లేవన్నారు. కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా ఏమైందని కళా వెంకట్రావ్ నిలదీశారు. జగన్ ఇప్పటి వరకు ఎన్ని సార్లు కేంద్రం మెడలు వంచారో ప్రజలకు లెక్క చెప్పాలని...మెడలు వంచేటప్పుడు విజయసాయిరెడ్డి లెక్కపెట్టడం మరిచిపోయారా? అంటూ కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.