యాప్నగరం

ట్రంప్‌‌నకు, జగన్‌కు తేడా లేదు.. స్థానిక ఎన్నికల వాయిదాపై అచ్చెన్న విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణపై రగడ కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అటు ప్రభుత్వం, నిర్వహించి తీరుతామని ఇటు ఎన్నికల కమిషనర్ పట్టుబడుతున్నారు.

Samayam Telugu 6 Dec 2020, 8:27 am
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధం కాగా.. కరోనా వైరస్ నేపథ్యంలో సాధ్యం కాదని ప్రభుత్వం తిరస్కరిస్తోంది. దీనిపై అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చి, గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే, దీనిని ఆమోదించవద్దంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్‌ను కలవడం మరింత వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిపై ప్రతిపక్షం టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. సీఎం జగన్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్‌తో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పోల్చారు.
Samayam Telugu వైఎస్ జగన్
YS Jagan Mohan Reddy


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్‌‌నకు, ముఖ్యమంత్రి జగన్‌‌మోహన్ రెడ్డికి తేడా లేకుండా పోయిందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఎన్నికల భయంతో జగన్ వణుకుతున్నారని, స్థానిక ఎన్నికల వాయిదాకు అసెంబ్లీలో తీర్మానం చేయడం ట్రంప్‌ తరహా పోకడలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. కరోనా వల్ల ఎన్నికల వాయిదా కోరుతున్నామని చెప్పడం జగన్‌ పిరికితనానికి నిదర్శనమని అచ్చెన్న విమర్శించారు.

అసెంబ్లీలో ఒక్క రోజైనా మాస్క్ పెట్టుకోని జగన్‌, ఆయన మంత్రులు కరోనా గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. బిహార్‌, రాజస్థాన్‌, హైదరాబాద్‌లో ఎన్నికలు నిర్వహించగా లేని కరోనా.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు అడ్డొచ్చిందా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై అసెంబ్లీలో తీర్మానించడం అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని టీడీపీ అధ్యక్షుడు దుయ్యబట్టారు.

రైతుల తరఫున పోరాడేందుకు టీడీపీ అన్ని వేళలా ముందుంటుందని తనను కలిసిన రైతు సంఘాల నేతలతో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్సీపీ వ్యవసాయ వ్యతిరేక విధానాలపై పోరాడినందుకు అచ్చెన్నను రైతు సంఘాలు నేతలు అభినందించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు వై.కేశవరావు, ఏపీ కిసాన్‌ సభ కార్యదర్శి డి. హరినాథ్‌ ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.