యాప్నగరం

CM Jagan కు మరో ఎదురుదెబ్బ.. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ప్రభుత్వ టీచర్లు!

జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో మరో ముందడుగు..!

Samayam Telugu 12 Feb 2022, 11:24 pm
జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉపాధ్యాయ సంఘాలు పోరుబాటపట్టాయి. ఉద్యమ బాటలో ఉపాధ్యాయ సంఘాలు మరో ముందడుగు వేశాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు శనివారం విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు.
Samayam Telugu ఏపీ ఉపాధ్యాయుల ఆందోళన


ఈ సందర్భంగా కలిసి వచ్చే అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్లేందుకు నిర్ణయించినట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. కాంట్రాక్టు, ఔవుట్‌సోర్సింగ్‌ జేఏసీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఫ్యాప్టో అధ్యక్షుడు సుధీర్‌ బాబు మాట్లాడుతూ.. వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

అలాగే, 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. పొరుగుసేవల ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ, డీఏ, టీఏ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఫ్యాప్టో కార్యదర్శి శరత్‌ చంద్ర మీడియాకు వెల్లడించారు. తమ కార్యాచరణపై ఈనెల 14న సీఎస్‌కు నోటీసు ఇవ్వనున్నట్టు చెప్పారు.

ఉపాధ్యాయ సంఘాల ఉద్యమ కార్యాచరణ ఇదే..
  • ఈ నెల 14, 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం
  • ఈ నెల 15 నుంచి 20 వరకు పీఆర్సీ పునఃసమీక్షకు సంతకాల సేకరణ
  • ఈనెల 21- 24 మధ్య ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లతో బ్యాలెట్ల నిర్వహణ
  • మంత్రులకు, ఎమ్మెల్యేలకు విజ్ఞాపనలు
  • ఈనెల 25న ప్రభుత్వానికి బహిరంగ లేఖ
  • మార్చి 2, 3న కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.