యాప్నగరం

మా నీళ్లు తీసుకుని తీరుతాం.. కేసీఆర్ సర్కారుపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు

కృష్ణా జలాల వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తమ నీటిని మాత్రమే తీసుకుంటున్నామని, పోతిరెడ్డిపాడు వద్ద ప్రాజెక్టు కట్టుకోవడం తమ హక్కని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Samayam Telugu 12 May 2020, 10:08 pm
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని తీసుకోవడానికే తాము ప్రాజెక్టు కట్టుకుంటున్నామ‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని తెలంగాణ సర్కారు రాజ‌కీయం చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని వ్యాఖ్యానించారు. నదీ జ‌లాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మంగ‌ళ‌వారం తన నివాసంలో ఇరిగేష‌న్ అధికారుతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి దాపురించింద‌న్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల‌ని హితవు పలికారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామ‌ని స్పష్టం చేశారు. కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం లేద‌ని తేల్చి చెప్పారు. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశాకే నీటి కేటాయింపులు చేస్తుంద‌ని వివరించారు.
Samayam Telugu శ్రీశైలం డ్యామ్


ఏపీకి కేటాయించిన నీటిని తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద ప్రాజెక్టు కట్టుకోవడం తమ హక్కని సీఎం జగన్ స్పష్టం చేశారు. శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉందని సీఎం జగన్ చెప్పారు. ఈ స్థాయి నీటిమట్టం సంవత్సరంలో సగటున 10 రోజులకు మించి ఉండడం మహా కష్టమని, ఆ పది రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అదే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరితే 7 వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టమని, ఇక 841 అడుగులకు చేరితే వేయి క్యూసెక్కులు మాత్రమే నీరు వెళ్తుందన్నారు.

ఇక తెలంగాణ ప్రాజెక్టుల విష‌యానికొస్తే.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో కూడా రోజుకు 2 టీఎంసీల మేర ( 23,148 క్యూసెక్కులు) నీటిని తరలించవచ్చని, ఇలా 90 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని సీఎం జగన్ వెల్లడించారు. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నీటిని రోజుకు 0.3 టీఎంసీల (3,500 క్యూసెక్కుల) నీటిని తీసుకెళ్లగలరని, ఇలా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని తెలిపారు. ఇదే 800 అడుగుల స్థాయిలో దిండి నుంచి రోజుకు 0.5 టీంఎసీలను (5,787 క్యూసెక్కులు) తెలంగాణ తీసుకెళ్లగలదు. ఇలా 30 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని తెలిపారు. ఇలా వివిధ ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి సుమారు 200 టీఎంసీల నీటిని తీసుకునే సామర్థ్యం తెలంగాణకు ఉందని సీఎం జ‌గ‌న్ అన్నారు. దీనికి తోడు జూరాల, భీమ, నెట్టెంపాడు, కోయల్‌సాగర్‌ల నుంచి నుంచి కూడా శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే తెలంగాణ నీళ్లు తీసుకోగలుగుతుందన్నారు.

శ్రీశైలంలో ఒకవైపు 800 అడుగులు, ఇతర తక్కువ నీటిమట్టాల స్థాయినుంచి నీటిని ఇన్ని ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తుంటే.. ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి, కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి తాగునీరు ఇవ్వడానికి ఒక సదుపాయం మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏపీకి పరిమితులు విధించాలనడం ఎంతవరకు సమంజస‌మ‌ని ప్రశ్నించారు. నీటి పంపకాలపై కృష్ణా రివర్‌ వాటర్‌ బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందని, అలాంటప్పుడు ఎవరైనా దీన్ని రాజకీయం చేయడం సమంజసం కాదని హిత‌వు ప‌లికారు. దీనిపై ఎవరైనా మానవత్వంతో ఆలోచించాలని కోరారు. దివంగత వైఎస్‌ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆరోజు మానవత్వంతో ఆలోచించడం వల్లే.. తెలంగాణ ప్రాంతంలో ఇదే శ్రీశైలం నుంచి పాలమూరు– రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్ధత కాని, కల్వకుర్తి, ఎల్‌ఎస్‌బీసీ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా గాని తక్కువ నీటిమట్టం ఉన్నప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోగలుగుతున్నార‌ని పేర్కొన్నారు. మా నీళ్లను మేం తీసుకుంటామని సీఎం జగన్ తేల్చి చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.