యాప్నగరం

అమిత్ షాతో సీఎం జగన్‌ భేటీ: 15 రోజుల్లో రెండోసారి ఢిల్లీకి.. ఎందుకు?

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నెలలోనే రెండోసారి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ టూర్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 30 Mar 2023, 12:54 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారా? లేదా తిరుగు ప్రయాణమవుతారా? అనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది.
Samayam Telugu అమిత్ షాతో సీఎం జగన్ భేటీ (ఫైల్ ఫొటో)


కాగా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కోసం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, 15 రోజుల వ్యవధిలోనే సీఎం జగన్ రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్.. ఆ మరుసటి రోజు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వేర్వురుగా భేటీ అయ్యారు. తాజాగా, మరోసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై పలు రకాల ప్రచారాలు సాగుతున్నాయి.

మరోవైపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ముందు.. మంగళవారం గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. అయితే, ఏపీ బడ్జెట్ సమావేశాల అనంతరం మర్యాదపూర్వకంగా గవర్నర్‌‌ను సీఎం జగన్ కలిశారని చెబుతున్నప్పటికీ.. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. అయితే, ఈ విషయాలపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.