యాప్నగరం

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. కాంగ్రెస్‌ పార్టీకి ఇష్టం లేదా?

నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సహా మిగతా రాష్ట్రాల ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం వదిలేసింది.

Samayam Telugu 1 Nov 2019, 1:56 pm
తెలంగాణ విడిపోయాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలకు సన్నద్ధం అవుతోంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా.. 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో.. ఆంధ్ర రాష్ట్రం కాస్తా.. ఆంధ్రప్రదేశ్‌గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. 2014 జూన్ 2న రాష్ట్రం విడిపోయాక.. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకొంటున్నారు. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం.. అవతరణ దినోత్సవం జరుపుకోలేదు. నవ నిర్మాణ దీక్షల పేరిట దీక్షలు నిర్వహించింది.
Samayam Telugu congress ap


జగన్ సీఎం పగ్గాలు చేపట్టాక.. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ముందే రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై కేంద్ర హోం శాఖను ఏపీ అధికారులు వివరణ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ఒరిజనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో మాదిరిగానే నవంబర్‌ 1న అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర హోం శాఖ సూచించిందని.. అందుకే నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొంటున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొందరు మాత్రం ఏపీ అవతరణ వేడుకలను అక్టోబర్ 1న జరిపితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే భావనలో ఉందో లేదంటే మరో కారణమో తెలీదు కానీ.. ఆంధ్రప్రదేశ్‌కు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేదు. హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలు, కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. కానీ ఏపీకి మాత్రం విషెస్ చెప్పలేదు.

దీంతో ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం మరిచిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు మాత్రం అక్టోబర్ 1న అవతరణ దినోత్సవం జరపడం సరైందనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉందని.. అందుకే ఏపీ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేదని భావిస్తున్నారు.

Read Also: ఐదేళ్ల తర్వాత ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.