యాప్నగరం

ప్రధాని మోదీకి సీఎం జగన్ దత్తపుత్రుడు: సీపీఐ నేత నారాయణ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ దత్తపుత్రుడని ఎద్దేవా చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 22 May 2022, 8:33 am
Samayam Telugu సీపీఐ నేత నారాయణ
ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. మోదీ దయాదాక్షిణ్యాలతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్‌రెడ్డి మోదీకి దత్తపుత్రుడు అనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా పత్తికొండలో సీపీఐ కార్యాలయంలో నారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ అరాచక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.

దేశంలో నానాటికీ నిరుద్యోగం పెరిగిపోయి యువతకు ఉపాధి అవకాశాలు దక్కటం లేదని నారాయణ ఆరోపించారు. పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు ఆకాశన్ని అంటడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ త్వరలో జాతీయ స్థాయిలో అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

ఇక, వైసీపీ పాలనలో అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం జగన్‌ సింహం సింగిల్‌గా వస్తారంటారని.. కానీ, వేలాది మంది పోలీసుల రక్షణ లేనిదే సీఎం కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలీసుల సహకారంతో ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.