యాప్నగరం

‘పాలన సమర్ధంగా ఉండాలే గానీ రాజధానికి రూ.లక్ష కోట్లు అక్కర్లేదు’

మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. పరిపాలనను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తారనే ప్రచారంతో ఆ ప్రాంతంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 6 Dec 2022, 5:53 pm
రాజధానిని అమరావతి నుంచి తరలింపు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు సైతం తీవ్రంగా తప్పుబడుతున్నాయి. రాజధానికి లక్ష కోట్ల ఖర్చవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తాన్ని వెచ్చించలేమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు ఎందుకని, అవసరమైన మేరకు పనులు చేసుకుంటే సరిపోతుందని అన్నారు.
Samayam Telugu Amaravati


పరిపాలన సమర్థంగా ఉండాలేగానీ, ఇంద్రభవనాలు అవసరం లేదని నారాయణ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎన్నికల మేనిఫెస్టోలో మూడు రాజధానులను ప్రస్తావించని జగన్‌కు రాజధానిని మార్చే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. ఒక వేళ రాజధానిని మార్చాలనుకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. మూడు రాజధానులను మేనిఫెస్టోలో చేర్చి ఎన్నికల్లో గెలిచి రావాలని నారాయణ సూచించారు.

అలాగే, రాజధానిపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. విశాఖలో భూకుంభకోణంపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్‌ వేసి, నివేదికను పక్కనపెట్టారని.. మళ్లీ ఇటీవల జగన్ సిట్‌ వేసి, నివేదికను బయట పెట్టడం లేదని నారాయణ దుయ్యబట్టారు. భూముల వ్యవహారాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ధర్మాన కుమారులు, తిప్పల గురుమూర్తి ఉన్నారని ఆయన ఆరోపించారు. భూముల కబ్జాల్లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ నాయకుల హస్తం ఉందని దుయ్యబట్టారు. భూముల ఆక్రమణకు పాల్పడినవారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా రెండో రోజు శనివారం నిర్వహించిన రాజకీయ ప్రతినిధుల సదస్సులో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుభాష అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంగ్లంతోపాటు తెలుగునూ కొనసాగించినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.