యాప్నగరం

షాకింగ్: ప్రొక్లైనర్‌, ట్రాక్టర్‌లో కరోనా రోగుల మృతదేహాలు.. జగన్ సీరియస్, ఇద్దరిపై వేటు

ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి విషయంలో దారుణంగా వ్యవహరించారు.

Samayam Telugu 27 Jun 2020, 11:16 am
శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా వైరస్ (కోవిడ్‌ 19) కారణంగా మరణించిన వ్యక్తి అంత్యక్రియలు విషయంలో అధికారులు అమానవీయంగా వ్యవహరించారు. మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి జేసీబీ, ట్రాక్టర్లలో తరలించారు. ఈ ఘటనపై తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు శుక్రవారం ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. కరోనా రోగుల మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి జేసీబీ, ట్రాక్టర్లలో తరలించడాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు వెల్లడించారు. కనీసం చనిపోయిన తర్వాత అయినా వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉందన్నారు. అమానవీయమైన ఇలాంటి ఘటనకు కారణమైన జగన్ సర్కారును చూసి సిగ్గుపడుతున్నట్లు మండిపడ్డారు.
Samayam Telugu ప్రొక్లైనర్‌లో కరోనా రోగి మృతదేహం


కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో సీఎంఓ అధికారులు మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి పొక్లెయిన్‌ ద్వారా మృతదేహాన్ని తరలించడం అమానవీయమని స్పష్టంచేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ మేరకు విచారణ జరిపిన జిల్లా కలెక్టర్‌ నివాస్, పలాస మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌ను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ సోకిన వారి విషయంలో వివక్ష లేకుండా, అమానవీయ చర్యలకు దిగకుండా వైద్య ఆరోగ్య శాఖ ఇదివరకే స్పష్టమైన నిబంధనలను జారీ చేసిందని ఈ సందర్భంగా ప్రభుత్వం మరోసారి గుర్తు చేసింది. సీఎం జగన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించిందని.. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకూడదు. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోకతప్పదు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.