యాప్నగరం

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని ప్రవేశించిన తర్వాత ఆగస్టులో తొలిసారి అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరాలను ఆనుకుని ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

Samayam Telugu 10 Aug 2020, 8:50 am
బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో.. ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు దగ్గర్లో ఏర్పడింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. సోమవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Samayam Telugu బంగాళాఖాతంలో అల్పపీడనం
depressin on bay of bengal


ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ప్రస్తుతం ఉత్తర ఛత్తీ‌సగఢ్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా 5.8కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. మధ్య తమిళనాడు పరిసరాల్లో 7.6కి.మీ.ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడిందని, వీటి ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం ఉదయం ఉత్తరాంధ్రలో అక్కడక్క భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.

విజయనగరంలో 123 మిల్లీమీటర్లు, నెల్లిమర్ల 60 మిల్లీమీటర్లు, వంగరలో 58 మి.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం ఉత్తరాంధ్ర సహా యానాంలలో భారీవర్షాలు కురుస్తాయని, రాయలసీమలోనూ అక్కడక్కడ భారీవర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.