యాప్నగరం

రాష్ట్ర ఆర్థిక స్థితిపై జగన్ సర్కార్ పచ్చి అబద్దాలు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

YS Jagan Mohan Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Samayam Telugu 19 Apr 2020, 6:42 pm
కరోనా వైరస్ ముసుగులో గతేడాది (2019-20) వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతేడాది రాబడులు తగ్గడానికి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే కారణం తప్ప, కరోనా కాదని స్పష్టం చేశారు. జనతా కర్ఫ్యూ, లాక్‌ డౌన్‌ ప్రభావం గత ఆర్థిక సంవత్సరంపై మార్చి చివరిలో 9 రోజులు మాత్రమే ఉందని పేర్కొన్నారు. గతేడాది ఎక్సైజ్‌ రాబడి రూ.6,536 కోట్లకు పెరగడంపై సీఎం జగన్‌ ఏం చెబుతారని ప్రశ్నించారు. రూ.336 కోట్ల మద్యం విక్రయాలు పెరిగాయని ప్రభుత్వ లెక్కలే చెప్పాయన్నారు.
Samayam Telugu 42b29dcb-d764-4eb3-9e2d-f8ae3c9cce00


పొరుగు రాష్ట్రాల నుంచి తరలించిన అక్రమ మద్యం విక్రయాలకు లెక్కేలేదని యనమల మండిపడ్డారు. కరోనా పేరు చెప్పి ఉద్యోగుల మార్చి నెల జీతాలు, పెన్షన్లలో సగం కోత పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల సంక్షేమ పథకాల్లో భారీ కోతలుపెట్టి, అనేక పథకాలను రద్దు చేశారన్నారు. వీటన్నింటి ద్వారా రూ. వేల కోట్లు ఆదా చేసుకున్నట్లు తెలిపారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పుష్కలంగా వచ్చాయని, 14వ ఆర్థిక సంఘం బకాయిలు రూ.1,300 కోట్లు, నరేగా నిధులు మరో వెయ్యి కోట్లపైనే వచ్చాయన్నారు.
కరోనా కోసం కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు ఇచ్చిందని, ఆ నిధులన్నీ వైసీపీ విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిందని యనమల మండిపడ్డారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులేసి నిధులు వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక చర్యలపై కోర్టుల్లో వాదనలకు భారీగా నిధుల ఖర్చు చేస్తున్నారని, 4 లక్షల గ్రామ వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి జీతాల పేరుతో వైసీపీ కార్యకర్తలకు ఏడాదికి రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం పడిందని చెప్పడం పచ్చి అబద్దమని యనమల వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.