యాప్నగరం

ఇక ఆయనే దిక్కు.. కలవాలని నిర్ణయించిన రాజధాని రైతులు

ఒకవైపు రాజధాని తరలిపోతోందన్న ప్రచారం.. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు ఎలాంటి అభివృద్ధికీ నోచుకోని వైనం. ఏపీ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు కూడా అరకొరగానే సాగుతుండడంతో భూములిచ్చిన రైతుల్లో ఆందోళన నెలకొంది.

Samayam Telugu 6 Oct 2019, 8:52 pm
రాజధాని అమరావతిపై ప్రభుత్వం చర్చిస్తోందంటూ మున్సిపల్ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో ఏపీలో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ దుమ్మెత్తిపోసుకున్నాయి. రాజధాని అమరావతిలో ఉండడం సీఎం వైఎస్ జగన్‌కు ఇష్టం లేదని, దొనకొండకు తరలిపోతోందంటూ ప్రచారం కూడా జరిగింది. రాజధాని నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేసిన తరువాత ఇప్పుడు ప్రభుత్వం రాజధానిని తరలించడం తగదన్న వాదనలూ వినిపించాయి. రాజధానిపై కొనసాగుతున్న సందిగ్ధంతో భూములిచ్చిన వేల మంది రైతులు ఆందోళనలో పడ్డారు.
Samayam Telugu amaravathi


తమ ప్రాంతంలో రాజధాని ఉంటుందని భావించి తమ భూములను త్యాగం చేశామని, రాజధానిని తరలించడం తగదని రాజధాని రైతులు ప్రభుత్వానికి పలురకాలుగా విన్నవించారు. రాజకీయ పార్టీల నేతలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మద్దతు తెలపాల్సిందిగా కోరారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను కలిసి రాజధాని తరలిపోకుండా చూడాలని, రాజధాని రైతులకు మద్దతివ్వాలని కోరారు. స్పందించిన పవన్ రాజధానిలో రెండు రోజులు పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. రాజధాని రైతుల త్యాగాలను అపహాస్యం చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. బీజేపీ నేత కన్నా కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు.

Also Read: మోదీ బాటలో జగన్.. పటేల్ తరహాలో వైఎస్ విగ్రహం..

అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. క్రమంగా రాజధాని విషయంపై రాజకీయంగా కాస్త వేడి తగ్గినప్పటికీ భూములిచ్చిన రైతును మాత్రం ఆందోళన వెంటాడుతోంది. రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం చేపట్టిన పనులు మినహా జగన్ సర్కార్ కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టకపోవడంతో రైతులకిచ్చిన ప్లాట్లు కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. మూడు పంటలు పండే భూములు తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు ఎటూ పనికిరాకుండా పోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.

Read Also:‘ఆ పదవి రాకుండా అడ్డుకున్నారు.. జగన్‌‌‌పై మోదీ, అమిత్ షాకు ఫిర్యాదు చేశా’

ఇక ఈ సమస్యను సీఎం జగన్ మాత్రమే పరిష్కరించగలరని నిర్ణయానికి వచ్చిన రైతులు ఆయన్ను కలవాలని నిశ్చయించుకున్నారు. ప్రభుత్వం తమకు కేటాయించిన ప్లాట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని, వాటిని త్వరగా అభివృద్ధి చేయాలని సీఎంను కోరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈరోజు తుళ్లూరు మండలం మందడంలో రాజధాని రైతులు సమావేశమై ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాజధానిలో త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టాలని జగన్ ను కోరాలని వారు సమావేశంలో తీర్మానించినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.