యాప్నగరం

గన్నవరం ఎమ్మెల్యే వంశీ సంచలన నిర్ణయం..

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఆయన వేరే పార్టీలో చేరతారా? రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.

Blogger - Sivakasi Samayal 27 Oct 2019, 4:49 pm
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యేవల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తనను, తన క్యాడర్‌ను వైఎస్సార్సీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. తనను నమ్ముకున్న వారిని కాపాడుకునేందుకే పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Samayam Telugu vamshi_7056


వంశీ పార్టీ మారతారని గత కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తోంది. ఇటీవల ఆయన బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిసి పార్టీ మార్పుపై చర్చించారు. బీజేపీలో చేరితే తనపై ఉన్న కేసుల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు లేకపోవడంతో పునరాలోచనలో పడ్డారన్న ప్రచారం సాగింది. ఒకవేళ చేరినా ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుంది. తర్వాత ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసినా విజయావకాశాలు లేకపోవడంతో వంశీ చూపు అధికార వైఎస్సార్సీపీ వైపు మళ్లినట్లు వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆయన నిన్న సీఎం వైఎస్ జగన్‌లో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరనున్నారని, అందులో భాగంగానే జగన్‌తో సమావేశమయ్యారని తెలుస్తోంది. పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే అభ్యంతరాలు లేవని జగన్ చెప్పారని, అందుకు వంశీ కూడా సుముఖత వ్యక్తం చేశారన్న చర్చ జోరుగా నడిచింది. అంతేకాకుండా రాజీనామా చేసి పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని జగన్ ఎమ్మెల్యే వంశీకి హామీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది.

Also Read: బోటు వెలికితీత: ధర్మాడి సత్యం ఎవరికీ తెలిసేవారు కాదు.. విజయసాయి హాట్‌కామెంట్స్

తాజా వ్యవహారాలపై స్పందించిన ఎమ్మెల్యే వంశీ దీపావళి తర్వాత తన నిర్ణయం చెబుతానని తెలిపారు. అయితే దీపావళి రోజునే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది. అయితే అందులో వైఎస్సార్సీపీ నేతల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొనడం కొత్త చర్చకు దారి తీస్తోంది.

ఒక వేళ వైఎస్సార్సీపీలో చేరాలనుకుంటే ఆ పార్టీపై విమర్శలు చేస్తూ లేఖ ఎందుకు రాస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది. పార్టీ, పదవులతోపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారన్న చర్చ నడుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.