యాప్నగరం

Jagan సర్కారుకు శుభవార్త.. జర్మనీ సంస్థ భారీ సాయం.. రూ. 1,500 కోట్లు..!

జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు జర్మనీ దేశానికి చెందిన ఓ సంస్థ ముందుకొచ్చింది. రూ. కోట్లలో సాయం..!

Samayam Telugu 18 Jan 2022, 8:40 pm
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జగనన్న కాలనీల నిర్మాణానికి చేయూత అందించేందుకు జర్మనీ సంస్థ ముందుకొచ్చింది. ఏకంగా రూ. 1,000 - రూ. 1,500 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు జగనన్న కాలనీల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ కీలక విషయాలు వెల్లడించారు.
Samayam Telugu సీఎం జగన్


జగనన్న కాలనీల మొదటి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని అజయ్ జైన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. వర్షాకాలం పూర్తి కావడంతో పనులు ఊపందుకున్నాయని చెప్పారు.

జగనన్న కానీల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అజయ్‌ జైన్‌ వివరించారు. పేద ప్రజలనే చిన్న చూపు లేకుండా కాలనీల్లో అన్నీ మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని వెల్లడించారు.

జగనన్న కాలనీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర మార్గాల నుంచి కూడా ఆర్థిక సాయం తీసుకుంటున్నామని అజయ్ జైన్ చెప్పారు. జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి జర్మనీ దేశానికి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ రూ. 1,000 నుంచి రూ. 1,500 కోట్ల ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చిందని వెల్లడించారు.

జగనన్న కాలనీల్లో అండర్ గ్రౌండ్ విద్యుత్, విద్యుత్ పొదుపు చర్యలు తీసుకుంటున్నందుకు గాను ఆ సంస్థ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు. కాలనీల్లో మౌలిక వసతులపై కీలక దృష్టి పెట్టామని, సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అక్కడ కావాల్సిన ప్రతి ఒక్క వసతి ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జగనన్న కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామని అజయ్‌ జైన్‌ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.