యాప్నగరం

భద్రాచలం వద్ద 50 అడుగులు దాటిన గోదావరి, ధవళేశ్వరం వద్ద ప్రమాదకర స్థాయిలో..

గోదావరి నది మరోసారి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గత నెలలో వచ్చిన వరదల నుంచి తేరుకోక ముందే మరోసారి వరద ముప్పు ఏజెన్సీ ప్రజలను భయపెడుతోంది. ధవళేశ్వరం వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Samayam Telugu 8 Sep 2019, 11:15 pm
గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే ఓసారి గోదావరి నదికి వరదలు రాగా.. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో.. మరోసారి భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 49.8 అడుగులకు చేరింది. ఆదివారం రాత్రి 8 గంటలకు ఇది 50.8 అడుగులకు పెరిగిందని యాటపాక సబ్‌కలెక్టర్ తెలిపారు. కుంట వద్ద శబరి నది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో.. కూనవరం, పోలవరం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది.
Samayam Telugu godavari flood1


వరద ముంపు పొంచి ఉండటంతో.. తూర్పు గోదావరి జిల్లాలో సహాయక చర్యలు చేపట్టడానికి ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పోలవరం ఏజెన్సీ ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఆదివారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.32 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. ఇది 13 లక్షల క్యూసెక్కులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరికి వరద ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది.

శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. గొట్టా బ్యారేజీ నుంచి 71 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు కృష్ణా నదికి కూడా భారీగా వరద వస్తోంది. శ్రీశైలం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 214.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 198 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్ నుంచి 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.