యాప్నగరం

పట్టుబడ్డ 5.22 కోట్లు నాదే.. ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం డ్రైవర్‌ది: ఒంగోలు నగల వ్యాపారి

తమిళనాడులో పట్టుబడ్డ రూ.5.20 కోట్ల నగదు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.

Samayam Telugu 19 Jul 2020, 8:02 am
తమిళనాడు సరిహద్దులో పోలీసులకు పట్టుబడిన రూ.5.20 కోట్ల నగదు తనదేనని ప్రకటించుకున్న ఒంగోలు బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు మరిన్ని వివరాలు వెల్లడించారు. నగదు పట్టుబడిన కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ను తన డ్రైవరే అతికించినట్లు ఆయన చెప్పారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరుతో ఉన్న ఆ స్టిక్కర్‌కు గడువు ముగిసిందని పేర్కొన్నారు. డ్రైవర్‌ దాన్ని ఎక్కడ సంపాదించాడో తనకు తెలియదని బాలు చెప్పుకొచ్చాడు. కారులో పట్టుబడిన నగదు తనదేనన్న ఆయన.. శ్రావణ మాసం సందర్భంగా బంగారం కొనేందుకు చెన్నై తీసుకువెళ్తున్నట్లు వివరించారు.
Samayam Telugu తమిళనాడులో పట్టుబడ్డ నగదు
Tamil Nadu Cash


ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నట్లు మంత్రి బాలినేనికి ఈ నగదుతో ఎలాంటి సంబంధం లేదని వివరించారు. నల్లమల్లి బాలు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి సన్నిహితుడు కావడం, కార్పొరేటర్‌ అభ్యర్థిగా బరిలో నిలవడంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది. తమిళనాడు పోలీసుల తనిఖీల్లో రూ.5.22 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. పట్టుబడ్డ వాహనంపై గిద్దలూరు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో ఆ నగదు వైఎస్ఆర్‌సీపీ నేతలదేనంటూ ప్రచారం జరిగింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.

అయితే పట్టుబడ్డ ఆ నగదుతో తనకెలాంటి సంబంధం లేదంటూ గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తోసిపుచ్చారు. ఇదే సమయంలో ఆ వాహనం ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిది అని ప్రచారం జరిగింది. ఆ వాహనానికి ఎలాంటి అనుమతి లేకుండా ముగ్గురు వ్యక్తులు సరిహద్దు దగ్గర రాష్ట్రంలోకి రావడంతో.. తమిళనాడు పోలీసులు తనిఖీ చేశారు. అరంబాక్కం సమీపంలోని ఎలాపూర్‌ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వ‌హించ‌గా నగదు, భారీగా బంగారం గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.