యాప్నగరం

మూడు రాజధానులు భారమయ్యాయని దక్షిణాఫ్రికా అంటుంటే.. జగన్ మాత్రం: గల్లా

రాజధానిపై అసెంబ్లీలో జగన్ చేసిన ప్రకటనకు అనుగుణంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఉండటంతో అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Samayam Telugu 22 Dec 2019, 8:16 am
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు, నాలుగు ప్రాంతీయ మండళ్లు ఉండాలని సూచించిన జీఎన్ రావు కమిటీ నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆ ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము వ్యతిరేకం కాదని, ఆ పేరుతో రాజధానిని తరలిస్తే భూములిచ్చిన తమ పరిస్థితేంటని నిలదీస్తున్నారు. అటు ప్రతిపక్ష టీడీపీ కూడా జగన్ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఖర్చుతో కూడున్నదని వ్యాఖ్యానించారు. రాజకీయం కోసం రాజధానిని వికేంద్రీకరించడం తగదని హితవు పలికారు.
Samayam Telugu galla


అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రభుత్వ భవనాలు నిర్మించడం కాదని, మూడు రాజధానులకు మంత్రులు, అధికారులు తిరగడం వ్యయప్రయాసలతో కూడుకున్నదని అన్నారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఆర్థిక భారంగా మారిందని ప్రస్తుత అధ్యక్షుడు ప్రకటించిన విషయం గుర్తుచేశారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఒకే రాజధాని ఉండాలని, అమరావతి తప్పకుండా పెట్టుబడులను ఆకర్షించే నగరంగా ఉంటుందన్నారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరిస్తే భవిష్యత్తులో ఎక్కడా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రారని గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు.

కాగా, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే తెరపైకి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. రాజధాని పేరుతో అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. జీఎన్‌ రావు కమిటీ తప్పుడు నివేదికలు సమర్పించిందని ధ్వజమెత్తారు. అమరావతి నుంచి రాజధానిని నుంచి తరలించే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోపోతే ఉద్యమిస్తామని ఉద్ఘాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.