యాప్నగరం

AP Godavari Floods: వరద ముంపులోనే లంక గ్రామాలు.. సముద్రంలోకి 550టీఎంసీల నీరు

గోదావరిలో వరద ప్రవాహ తీవ్రత కొనసాగుతోంది. దీంతో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మంగళవారం వరద తగ్గినప్పటికీ భారీ వర్షాల కారణంగా బుధవారం మళ్లీ వరద పెరిగింది. అమలాపురం డివిజన్‌లోని లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

Samayam Telugu 8 Aug 2019, 9:12 am
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం వరద ప్రవాహ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మన్యంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలో అత్యధికంగా 21.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలోని పలు మండలాల్లోనూ భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో మన్యంలోని జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో ఆ నీరంతా గోదావరిలోకి వచ్చి చేరుతోంది.
Samayam Telugu pjimage

Also Read: నిండు కుండలా శ్రీశైలం డ్యామ్.. రేపు గేట్లు ఎత్తే అవకాశం


గోదావరిలో ప్రాణహిత నుంచి దిగువకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో బుధవారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 10.6 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడిచిపెట్టారు. దీంతో బుధవారం ఒక్కరోజే 100 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. ఆగస్టు 1 నుంచి ఏడో తేదీ వరకు గోదావరి నుంచి సుమారు 550 టీఎంసీల నీరు సముద్రంలోకి వదిలినట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరి దిగువ ప్రాంతాల్లో వందలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంటే.. ఎగువన ఉన్న సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులు నీరులేక బోసిపోతున్నాయి.

Also Read: వీడియో: పోలవరం వద్ద చీలిన భూమి.. కళ్లెదురుగానే గోదావరిలోకి

ఆందోళనలో కోనసీమ లంక గ్రామాలు
వారం రోజులుగా వరద ముంపులో చిక్కుకున్న కోనసీమ లంక గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. చుట్టూ నీరున్నా తాగేందుకు గుక్కెడు మంచినీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అమలాపురం డివిజన్‌లోని 16 లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. బాధిత గ్రామాల ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఇతర ప్రాంతాలతో ఆ గ్రామాలకు రవాణా మార్గాలు తెగిపోవడంతో పడవల్లో ప్రయాణిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు అమలాపురం ఆర్డీవో వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర జలవనరు శాఖ మంత్రి అనిల్‌కుమార్ బుధవారం దేవీపట్నం మండలంలోని ముంపు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: గోదావరి వరదల కవరేజ్‌‌లో జర్నలిస్టుకు భయానక అనుభవం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.