యాప్నగరం

గోదావరి మహోగ్రరూపం.. బిక్కుబిక్కుమంటున్న లంక గ్రామాల ప్రజలు

గోదావరి నదికి వరదపోటెత్తింది. కోసీమలోని లంకభూముల్లోని వివిధ పంటలు ముంపు బారినపడ్డాయి. వరద పెరుగుతున్న నేపథ్యంలో సుమారు 20 లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Samayam Telugu 16 Aug 2020, 7:18 am
గోదావరికి వరద పోటెత్తి మహోగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఎగువ ప్రాంతాలను ముంచెత్తిన వరద మరింత పెరగడంతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద శనివారం మధ్యాహ్నం మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. బ్యారేజీ 175 గేట్లనూ ఎత్తి సముద్రంలోకి 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు తెలిపారు. అంతకంతకూ వరద నీరు బ్యారేజీ వద్దకు చేరుతుండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నట్లు జలవనరుల శాఖ అధికారులు చెప్పారు.
Samayam Telugu గోదావరికి పోటెత్తి వరద
Godavari Floods


వరద ఉద్ధృతికి శనివారం మధ్యాహ్నానికి తొయ్యేరు, దేవీపట్నం, పోశమ్మగండి, పూడిపల్లి, దండంగి, పాతూరు, ఎ.వీరవరం, గానుగులగొందు, నాగలపల్లి, కె.వీరవరం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. తొయ్యేరు ఎస్సీ కాలనీ నుంచి దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌ వరకూ ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

రంపచోడవరం డివిజన్ పరిధి దేవీపట్నం మండలం పొసమ్మగండి వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారిని వరద నీరు చుట్టుముట్టింది. దేవీపట్నం, పూడిపల్లి గ్రామాల్లోకి పూర్తిగా వరద నీరు ప్రవేశించి, సుమారు మోకాలోతుపైగా చేరంది.

పడవలపై సురక్షిత ప్రాంతాలకు ప్రజలను అధికారులు తరలిస్తున్నారు. దేవీపట్నం మండలం తొయ్యురు వద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరగా, ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు, పోలవరం ముంపు మండలాల్లోకి వరద చేరడంతో సహాయ చర్యలకు రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికార యంత్రాంగం తరలించింది. స్పిల్‌వేకు ఎగువన రక్షణగా నిర్మించిన బండ్‌కు గండి పడి వరద నీరు చేరడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.