యాప్నగరం

దక్షిణాదిని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. శ్రీహరికోట షార్‌లో హైఅలర్ట్

దక్షిణాది రాష్ట్రాలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో తీర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇస్రో కీలక కేంద్రమైన షార్‌ను జల్లెడపడుతున్నారు.

Samayam Telugu 13 Sep 2019, 1:13 pm
దక్షిణాది తీర ప్రాంతాల గుండా ఉగ్రమూకలు దేశంలోకి చొరబడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఇక, భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో‌ను హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉగ్ర కదలికల హెచ్చరికలతో సీఐఎస్ఎఫ్ దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. షార్‌ కేంద్రం వద్ద 50 కిలోమీటర్ల మేర తీరం ఉండటంతో గస్తీ ముమ్మరం చేశారు. అదనపు బలగాలను మోహరించి, వాహనాల ద్వారా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. షార్‌ పరిసరాల్లోని అడవుల్లో కూంబింగ్‌ నిర్వహించి అదనపు విధులు నిర్వహిస్తున్నాయి.
Samayam Telugu shar


కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచిన అధికారులు, షార్‌ మొదటి, రెండు గేట్ల వద్ద సాధారణ రోజుల కన్నా భద్రతను మరింత పెంచారు. షార్‌కు వచ్చిపోయే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తూ తీరంలో తిరిగే పడవలపై నిఘా ఉంచారు. శ్రీహరికోట మెరైన్‌ పోలీసు స్టేషన్ సిబ్బంది తీర ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తూ.. కొత్తవారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతవాసులకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు.

తీరంలో తిరిగే పడవలు, మత్స్యకారుల వివరాలను సీఐఎస్‌ఎఫ్‌, మెరైన్‌ పోలీసులు సేకరిస్తున్నారు. కొత్తగా పడవలు వచ్చినా, అనుమానం వచ్చినా వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో కేంద్ర పారిశ్రామిక దళాలు కూబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. అలాగే శ్రీహరికోట సమీపంలోని వేనాడు దర్గాపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం నెల్లూరు స్వర్ణాల చెరువులో రొట్టెల పండగ సందర్భంగా వేనాడుకు వేలాదిగా జనం వస్తున్నారు. ఇక్కడ కూడా భద్రత చర్యలు చేపట్టి, ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.