యాప్నగరం

రూటు మార్చిన పవన్.. జగన్ సర్కార్‌పై ఇక సమరమే!

రాజధాని అమరావతిపై దూకుడు పెంచాలని బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం ఇరు పార్టీల నాయకులు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

Samayam Telugu 28 Jan 2020, 7:52 pm
రాజధాని అమరావతి వ్యవహారం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. గత వారం రోజులుగా శాసన మండలి రద్దుపైనే ప్రజలందరి దృష్టి మళ్లింది. దీంతో రాజధాని అమరావతి రైతుల ఆందోళన మరుగున పడిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా, మండలి రద్దుకు వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. దీంతో మండలి రద్దు వ్యవహారం కేంద్రం కోర్టులో పడింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు మళ్లీ తమ కార్యకలాపాల దిశగా దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలు మంగళవారం (జనవరి 28) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఉభయ పార్టీలు సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశాయి.
Samayam Telugu Pawan Kalyan


Also Read: మేధావుల ఆలోచనలను కోల్పోతాం.. జగన్ సర్కార్‌పై పవన్ విమర్శలు
సమావేశానికి సంబంధించిన వివరాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల దగ్గరకు వెళ్లి, వారికి అండగా నిలవాలని బీజేపీ, జనసేన పార్టీలు సమావేశంలో నిర్ణయించాయి. రైతులకు భరోసా కల్పించాలని, రాజధాని అమరావతి విషయంలో ఉభయ పార్టీలు కలిసి ఉమ్మడి పోరాటం చేయాలని సంకల్పించాయి. ఈ సమావేశానికి బీజేపీ తరఫున దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంతారెడ్డి హాజరయ్యారు. జనసేన పక్షాన నాదెండ్ల మనోహర్, టి.శివశంకర్, కందుల దుర్గేష్ హాజరయ్యారు.

Also Read: అందుకే మనది హిందూ దేశం కాలేదు: పవన్ కళ్యాణ్

సమావేశంలో రాజధాని మార్పు, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంపై సుదీర్ఘంగా చర్చించారు. అమరావతి ప్రస్తుత దుస్థితికి గతంలో అధికారంలో ఉన్న టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రెండూ బాధ్యులే అని సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. రాజధాని మార్పు విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నామని అధికార వైసీపీ ప్రచారం చేస్తోందని, ఇది పూర్తిగా సత్యదూరమైన ప్రచారమని నేతలు తేల్చి చెప్పారు. ఇలాంటి అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారం చేయడంలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలూ ఒకేలా వ్యవహరిస్తున్నాయని ఈ కమిటీ పేర్కొంది.

బీజేపీ, జనసేన పార్టీలు కలిసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నాయి. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో కమిటీలు నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉభయ పార్టీల అధ్యక్షులు ఆమోదం తెలిపిన తర్వాత కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారని హరిప్రసాద్ తెలిపారు.

Also Read: ఎవరినీ వదలం.. నోటీసులకు సిద్ధంగా ఉండండి.. జనసేన హెచ్చరికలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.