యాప్నగరం

కరోనా కష్టకాలంలో చిల్లర రాజకీయాలా.. పవన్ కళ్యాణ్ ఫైర్

చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం.. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దాం. ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.

Samayam Telugu 22 Apr 2020, 12:23 pm
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు మానేసి ప్రజలకు సాయం చేయాలని హితబోధ చేశారు.. లేకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనా కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్లు గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయి అన్నారు.
Samayam Telugu pk.


ప్రపంచాన్ని క్రమక్రమంగా ఆక్రమిస్తున్న కరోనా కారణంగా అగ్రరాజ్యాలుగా పేరుపొందిన దేశాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి అన్నారు జనసేనాని. ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని.. అన్ని వసతులూ ఉన్న అగ్రరాజ్య ఆస్పత్రులు రోగులందరికీ సేవలు అందించలేక నానా అవస్థలు పడుతున్నాయన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వంటి మందులను పంపమని భారతదేశాన్ని ప్రాధేయపడుతున్నాయి అన్నారు. ఈ పరిణామాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందరిపై ప్రభావం చూపేవని.. ఇక దేశంలో లక్షలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి, ఊరుకాని ఊరిలో ఉంటూ అర్జాకలితో అలమటిస్తున్నారన్నారు.

రైతులు తమ పంటను అమ్ముకునే దారి లేక పెంటకుప్పల్లో పోస్తున్నారన్నారు పవన్. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ను సైతం విడిచిపెట్టలేదని.. కేసులు పెరుగుతున్న తీరు చూస్తే ఈ మహమ్మారి ఎప్పటికి శాంతిస్తుందో ఊహకు అందడం లేదని.. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు చూసి బెంబెలెత్తిపోతున్నారన్నారు. ప్రపంచం అంతా ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురదచల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించవలసిన తరుణంలో రాజకీయాలను భుజాలకు ఎత్తుకున్నారని పవన్ మండిపడ్డారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయని.. ఆయనపై జరుగుతున్న వ్యక్తిత్వహనన దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండిచాలన్నారు జనసేనాని. ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో ఉందన్నారు. ఈ ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ కోరుతున్నది ఒక్కటే.. కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదామన్నారు. చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం.. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని పిలుపునిచ్చారు. ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.