యాప్నగరం

మహిళలకు ఈ విద్యలు నేర్పించండి.. జగన్ సర్కారుకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు

Janasena: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం విద్యార్థిని దారుణ హత్యను ఖండించారు.

Samayam Telugu 1 Nov 2020, 11:54 pm
విశాఖపట్నం జిల్లా గాజువాకలో వరలక్ష్మి అనే యువతి ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చట్టాలు చేశామని చెప్పుకుని, చేతులు దులుపుకోవడం సరికాదని జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


‘‘గాజువాకలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన 17 ఏళ్ల బాలికపై ప్రేమోన్మాది దాడిచేసి హత్య చేసిన ఘటన ఎంతో బాధ కలిగించింది. ఆ విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ ఆడబిడ్డ తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కొద్ది రోజుల కిందటే విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి హత్య చేసిన దుర్మార్గాన్ని ఎవరం మరచిపోలేదు.

ఇప్పుడు గాజువాకలోనూ అదే తరహా ఉన్మాదపు హత్య చోటు చేసుకోవడం దారుణం. ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలి. విద్యార్థినులు, యువతులు, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించకూడదు. దిశ చట్టం చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం.. అని ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై ఏం సమాధానం చెబుతారు.

చట్టాలు చేసేశామని చేతులు దులుపుకొంటే ఫలితం రాదు. ఆ చట్టం ఇప్పటికీ అమలులోకి రాకపోవడానికి కారణాలు ఏమిటో ప్రజలకు చెప్పాలి. ప్రచారాలతో ఫలితం రాదు అని గ్రహించాలి. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థినులకు ఆత్మ రక్షణ విద్యలు తప్పనిసరి చేయాలి. అదే విధంగా యువతులకు, మహిళలకు ఆత్మ రక్షణ మెళకువలు తెలపాలి. విద్య, స్త్రీ శిశు సంక్షేమ, హోం శాఖలు సంయుక్తంగా ఇందుకు సంబంధించి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలి.’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.